Additional Collector : ఇండియన్ గ్యాస్ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

by Kalyani |   ( Updated:2024-10-22 11:07:32.0  )
Additional Collector : ఇండియన్ గ్యాస్ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
X

దిశ,వెల్దుర్తి : వెల్దుర్తి ఎస్వీఆర్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెల్దుర్తికి వచ్చిన అదనపు కలెక్టర్ కు పలువురు లబ్ధిదారులు ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాకుడు చేస్తున్న అవినీతిపై ఫిర్యాదు చేశారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాకుడు ఇప్పటికే పలుమార్లు గ్రామాలలోకి సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ నుంచి తన సిబ్బంది చేత రిఫీలింగ్ చేయిస్తూ డబ్బులను దండుకున్నట్లు జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

అంతేకాకుండా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ధర కంటే అధిక ధరలు తీసుకుంటూ వినియోదారులను మోసం చేస్తున్నారని, ఇదేమని అడిగితే లబ్ధిదారులను భయభ్రాంతులకు గురిచేస్తూ వారిపై దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయన్నారు. ఏజెన్సీ నిర్వాకుడే నాటకీయంగా గ్యాస్ ను దోపిడీ చేస్తూ తనకు ఏమి తెలియదని బుకాయిస్తున్నారన్నారు. ఈ విషయం పై స్పందించిన జాయింట్ కలెక్టర్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు ఎందుకు తీసుకోలేదని తహసీల్దార్ కృష్ణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… గ్యాస్ ఏజెన్సీ పై వచ్చిన అవినీతి అక్రమాల ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటికప్పుడే సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జై చంద్రారెడ్డి, తహసీల్దార్ కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story