కుల బహిష్కరణ చేసిన కుటుంబానికి అండగా ఉంటాం.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

by Sumithra |
కుల బహిష్కరణ చేసిన కుటుంబానికి అండగా ఉంటాం.. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
X

దిశ, తూప్రాన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతొజిగూడ గ్రామంలో ఇటీవల కుల బహిష్కరణకు గురైన కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం, జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీవో జయ చంద్ర రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబాలకు అధికారులు, పోలీసులు ప్రతి ఒక్కరు అండగా ఉంటారని, గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేటట్లు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. మనోహరాబాద్ మండలం గౌతొజిగూడ గ్రామంలో ఎస్సీ, ఎస్టీల అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మానవులంతా సమానమని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులో పరారీలో ఉన్న వారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం గ్రామంలో జరపాలని జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఆదేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నెల పౌర హక్కుల దినం జరపడం వల్ల ప్రజలలో అనుమానాలు తొలగిపోతాయని, అందరూ సమానమేనని, అంతా ఒకటేననే భావన కలుగుతుందని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో ఉండాలంటే భయంగా ఉందని, తాము మరెక్కడికైనా వేరే చోటికి వెళ్లి బ్రతుకుతామని, ఈ గ్రామంలో ఉండలేమని రోధించారు. తమ గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని, గ్రామస్తులు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కు మొరపెట్టుకున్నారన్నారు. అనుక్షణం అండగా ఉంటామని పుట్టిన ఊరిలో బ్రతకాలని వారి కుటుంబానికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed