బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్​ సర్కార్​ చేసిన హత్య : ఎంపీ ఈటెల రాజేందర్​..

by Sumithra |
బుచ్చమ్మది ఆత్మహత్య కాదు రేవంత్​ సర్కార్​ చేసిన హత్య : ఎంపీ ఈటెల రాజేందర్​..
X

దిశ, కూకట్​పల్లి : బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ఇది ముమ్మాటికి రేవంత్​ రెడ్డి సర్కార్​ చేసిన హత్యే అని మాల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్​ ఆరోపించారు. హైడ్రా తమ ఇంటిని కూలుస్తుందని భయంతో మనస్థాపం చెందిన కూకట్​పల్లి గ్రామం యాదవ బస్తీకు చెందిన బుచ్చమ్మ శుక్రవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుచ్చమ్మ మృతదేహాన్ని కూకట్​పల్లి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మధ్య శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా శనివారం బుచ్చమ్మ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరామర్శించి అండగా ఉంటామని అన్నారు. అదే విధంగా గాంధీ ఆసుపత్రిలో బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్​, మాజీ మంత్రి తన్నీరు హరీష్​ రావు ప్రయత్నించారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య కూకట్​పల్లిలోని యాదవ బస్తీకు చేరుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని తరలించారు. ఎంపీ ఈటెల రాజేందర్​, స్థానిక బీజేపీ నాయకులతో బుచ్చమ్మ నివాసానికి చేరుకుని బుచ్చమ్మ భర్త శివయ్య, కూతుళ్లు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం ఈటెల రాజేందర్​ మాట్లాడుతూ హైడ్రా అధికారులు, వందల మంది పోలీసుల సమక్షంలో గత కొన్ని రోజుల క్రితం నల్ల చెరువులో నిర్దాక్షణ్యంగా కూల్చివేతలు చేపట్టారు. అనేక మంది షెడ్లు, ఇండ్లను కూల్చి వేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శివయ్యతో పాటు ఆయన అన్న కొడుకు అయిన మహేందర్​లు తనతో ఇవి పట్టాభూములు అని వాపోయారని గుర్తు చేశారు. నల్ల చెరువు సమీపంలో ఫ్లెక్సి షాపులు, క్యాటరింగ్​ చేసుకునే వారు, కార్పేంటర్​లు తమ వ్యాపారాలు కోల్పోయామని తమ ఆవేదనను వెళ్లగక్కారని అన్నారు. ఏ భూమి అయితే తనకు ఇచ్చారో అది పనికి రాదని బుచ్చమ్మ కూతుళ్లు, తల్లి తండ్రులతో చెప్పుకుని బాధ పడటంతో మనస్థాపం చెందిన బుచ్చమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. బుచ్చమ్మ చావు ఆత్మహత్య కాదు, బుచ్చమ్మను తెలంగాణ సర్కార్​, రేవంత్​ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసిందని అని ఆరోపించారు. ఇదే విధంగా నగరంలో మరొకరు హైడ్రా భయంతో గుండె పోటుతో మరణించినట్టు తెలుస్తుందని అన్నారు.

వేలాది మంది హైదరాబాద్​ గడ్డమీద, చెరువులు, ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకుని, పట్టాలు ఉన్న వారు, రిజిస్ట్రేషన్​ అయి ఉన్న వారు శనివారం, ఆదివారం వచ్చిందంటే కంటి మీదు కునుకు లేకుండా, పోయ్యి మీద కుండ పెట్టకుండా దిగాలుగా బతుకుతున్న పరిస్థతి ఉందని అన్నారు. చైతన్యపురి 60 ఫీట్ల ఎత్తుకు ఉంటుంది, వారికి చుక్క నీరు వచ్చే పరిస్థితిలేదు, వాళ్లను సైతం ఖాళీ చేయాలని ప్రభుత్వం హుకుం జారి చేస్తుందని ఆరోపించారు. గత 40 రోజులుగా హైడ్రా పేరుతో నల్ల చెరువు, బోయిన్​ చెరువు, బోరబండ సున్నం చెరువు, నగరంలోని చెరువుల వద్ద వందల నిర్మాణాలు కూల్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. రేవంత్​ రెడ్డి తమకు అండగా ఉన్నాడని హైడ్రా అధికారులు తమను తాము సుప్రీం గా భావిస్తూ అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రేవంత్​ రెడ్డి తెలంగాణ ప్రజలను ఏడిపించి ఓ షాడిస్ట్​ల సంతోష పడుతున్నట్టు కనిపిస్తుందని అన్నారు. రేవంత్​ రెడ్డి తనను తాను ఓ రాజులాగా నిజాం సర్కార్​లాగా వ్యవహరిస్తున్నాడన్నారు. గతంలో ఎంతో మందిని చూసాంకాని ప్రజలను ఏడిపించే ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డిని చూస్తున్నామని అన్నారు. ఐదేండ్ల కోసం అధికారం ఇస్తే ఐదు అంగళ్లుగా మార్చారాని అన్నారు. తెలంగాణ ప్రజల ఉసురు పోసుకుంటున్నారు, తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు. రేవంత్​ రెడ్డిని చూస్తే సంజయ్​ గాంధీ గుర్తుకు వస్తున్నారని, డిల్లీలో టర్క్​మెన్​ గేటు వద్ద వేలాది మంది పేద ఇండ్లను కూల్చిన సంజయ్​ గాంధి మారుతి కంపెనీని కట్టబెట్టారు.

వాళ్ల మాదిరిగానే రేవంత్​ రెడ్డి పేదల ఇండ్లను కూలుస్తు పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మూసీ ప్రక్షాళన అంటే వరదలు రాకుండా, మురికి లేని నదిగా అభివృద్ది చేస్తాడని అనుకుంటే 50 ఏండ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూడా ఆర్​బీఎక్స్​ (రివర్​ బెడ్​) అంటు మార్కింగ్​లు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, సంక్షేమ పథకాలను అమలు చేసే దమ్ము లేక వాటిని డైవర్ట్​ చేసేందుకు వేల కోట్లు సంపాదించేందుకు దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. గొప్ప పనులు చేస్తున్నారని చెబుతున్న పర్యావరణ ప్రేమికులు గుర్తించాలని కోరారు. హైడ్రా బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కూకట్​పల్లి ఇన్​చార్జి మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్​ రావు, మారబోయిన రవి కుమార్​ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed