Loan waiver : మాట ఇచ్చినం... నిలబెట్టుకుంటున్నాం

by Sridhar Babu |   ( Updated:2024-07-18 15:06:43.0  )
Loan waiver : మాట ఇచ్చినం... నిలబెట్టుకుంటున్నాం
X

దిశ, ఆందోల్ : మాట ఇచ్చినం... నిలబెట్టుకుంటున్నాం అని, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదని మరోసారి ఈ రుణమాఫీతో రుజువైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కరీంనగర్ లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ రూ.2 లక్షల రుణమాఫీ మాటిచ్చారని ఆ ఆ వాగ్దానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గురువారం ఆందోల్ మండలం డాకూర్ లో రైతులు నిర్వహించిన రైతు రుణమాఫీ సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రూ.2 లక్షల రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31 వేల కోట్ల రైతు రుణమాఫీ భారం ప్రభుత్వంపై పడుతున్నప్పటికి, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్న

తపనే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. 2009 లో ఆనాడు యూపీఐ సర్కార్ రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందని, మళ్లీ 13 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి రైతు రుణమాఫీకి కంకణం కట్టుకుందన్నారు. జిల్లాలో 48 వేల రైతు కుటుంబాలకు రూ.279.62 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. ఆందోలు నియోజకవర్గంలో 20 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు రూ.107 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. మొదటి విడతలో రూ.లక్ష వరకు, ఆగస్టు15 లోపు రూ.2 లక్షల మాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కులకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల సంక్షేమం, రైతు భద్రత, రాష్ట్ర అభివృద్ధిపై ఇకముందు దృష్టి సారిస్తామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి పథంలోకి

వచ్చేలా కృషి చేస్తామన్నారు. అంతకుముందు రైతు వేదిక ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ పాండు, జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, వ్యవసాయ ఏడీఏ అరుణ, తహసీల్దార్ భాస్కర్ కుమార్, ఏఓ విజయ రత్న, ఆక్సాని పల్లి పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ పద్మనాభరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజ్, మాజీ ఎంపీటీసీ కళాలి రమేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, కౌన్సిలర్లు ఎస్. సురేందర్ గౌడ్, డాకూరి శంకర్, కోరబోయిన నాగరాజు, కోఆప్షన్ సభ్యులు అల్లే శ్రీకాంత్, మాజీ వైస్ ఎంపీపీ మహేశ్వర్ రెడ్డి, నాయకులు డాకూరి వెంకటేశం, పట్లోళ్ల ప్రవీణ్ కుమార్, చింతకుంట శివ, కొత్త శ్రీనివాస్, అజయ్, సంజీవయ్య, జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మల్లప్ప, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed