- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల నియమాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు : కలెక్టర్
దిశ, మెదక్ ప్రతినిధి: భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మెదక్ పార్లమెంట్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూట్నీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని తెలిపారు. మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని, మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్ , నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లలో ఓటరు జాబితా సవరణ, తుది ఓటరు జాబితా ప్రకారం 18 లక్షల 12 వేల 858 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్‌కు రెండు కిలోమీటర్ల రేడియస్‌లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. అవసరమైన మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని, పోలింగ్ సిబ్బంది మొదటి రెండవ, తుది, రాండమైజేషన్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎన్నికల సిబ్బంది తీసుకొని చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు. మతం, కులం, ప్రాంతం పై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేయడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలకు, నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలు లేదని అన్నారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల దగ్గరలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన పై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు జిల్లాలో ఎంసీసీ, సర్వేలెన్స్ బృందాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, వీడియో సర్వేలెన్స్ బృందాలను, ఎంసీ ఎంసీ కమిటీ, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి పై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ, నెంబర్ , ద్వారా, సి-విజిల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదుల స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి -విజిల్ యాప్‌లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదు పై చర్యలు తీసుకుంటారని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు, ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్‌లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేటు స్థలాల్లో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో కరపత్రాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ముద్రించే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ ఫోన్ నెంబర్, అదేవిధంగా ఎవరు ప్రింట్ చేయమన్నారు, వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా పేర్కొనాలని తెలిపారు. ఈ అంశాన్ని అన్ని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి వివరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణనలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నాలుగో విడతలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటల పాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లా లో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు.