ప్రాణాలు హరించే పరిశ్రమ నుంచి మాకు విముక్తి కలిగించండి...

by Sumithra |
ప్రాణాలు హరించే పరిశ్రమ నుంచి మాకు విముక్తి కలిగించండి...
X

దిశ, తూప్రాన్ : ప్రాణాలు హరించే పరిశ్రమ నుండి మాకు ఎప్పటికీ విముక్తి లభించదని, నిత్యం వాయు, శబ్ద కాలుష్యాలతో ప్రాణాలు గుప్పేట్లో పెట్టుకొని బ్రతుకుతున్నామని మనోహరబాద్ మండల పరిధిలోని రంగాయపల్లి గ్రామస్తులు ఎంఎస్ అగర్వాల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి ధర్నా నిర్వహించారు. పలుమార్లు కలెక్టర్ కు, పొల్యూషన్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం రాత్రి సమయాలలో భారీ శబ్దాలకు నిద్ర పట్టట్లేదని తెలిపారు. వాయువులో వెదజల్లే పొగతో గ్రామంలో చిన్నారులు, వృద్ధులు శ్వాస కోశ వ్యాధులతో బాధపడుతున్నారని అన్నారు.

భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయని, రోడ్ల పై మొలలు, ఇనుము పడటంతో వాహనాలు పంచర్ అయి ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్, పొల్యూషన్ బోర్డు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మొదలు పరిశ్రమ పత్తి కంపెనీ అని గ్రామస్తులను మోసం చేసి స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేసి అధికారులు యజమానులు గ్రామస్తులను మోసం చేసి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. లేదంటే గ్రామస్తులతో కలసి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed