సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ

by Sridhar Babu |
సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ
X

దిశ, పటాన్ చెరు : నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర మొత్తం త్యాగధనుల అమరత్వమేనని, ఆ మహనీయుల ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రశ్నించేతత్వం అలవడిందన్నారు. నిజాం నిరంకుశ పాలనలో శిథిలమైపోయిన బతుకులను బాగు చేయడానికి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా దొరలు, జమిందారుల చేతుల్లో బానిసలుగా మగ్గుతున్న బహుజనులకు స్ఫూర్తినిస్తూ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు.

ఆనాడు బహుజనుల కోసం పోరాటం చేసిన ఆ మహనీయుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు పంచాలనే సంకల్పంతో వీరనారి సబ్బండ వర్గాల ప్రతినిధి చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహాన్ని చిట్కుల్లో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆమె స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలనే సంకల్పంతో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరుని పెట్టి ఆ వీరనారికి గుర్తింపునిచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్​రెడ్డి స్ఫూర్తితో సబ్బండ, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతూ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చాకలి వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ విష్ణువర్థన్ రెడ్డి, వెంకటేశ్, మురళి, రాజ్ కుమార్, ఆంజనేయులు, నారాయణ రెడ్డి, చాకలి సత్తయ్య, చాకలి కృష్ణ, చాకలి బాబు, నర్సింలు, యాదయ్య, కిషోర్, గోపాల్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed