Collector: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

by Kalyani |
Collector: విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్
X

దిశ, కౌడిపల్లి: వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం కౌడిపల్లిలోని హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించగా ఎంపిహెచ్ఈ వో (MPHEO) అబ్దుల్ షకీల్, మల్టీ హెల్త్ సూపర్ వైజరులు రమేష్, రాధాకృష్ణ హాజరు పట్టికలో సంతకాలు చేసి విధులకు హాజరు కావడం లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

జిల్లాలో సమర్థవంతమైన పాలన లక్ష్యంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడానికి క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని, ఆకస్మిక పర్యటనలు చేయడం జరుగుతుందని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఆసుపత్రిలోని రోగుల వద్దకు వెళ్లి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. వార్డులను, గదులను పరిశీలించారు. స్థానిక వైద్యురాలు ఫర్జానా తో మాట్లాడి వైద్య సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచి వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమెకు సూచించారు. వైద్యురాలు ఫర్జానా పనితీరును ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed