సర్వం కోల్పోయారు.. రోడ్డున పడ్డారు

by Mahesh |
సర్వం కోల్పోయారు.. రోడ్డున పడ్డారు
X

రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు వాళ్లు. సొంతింటి కలను సాకారం చేసుకుందామని జీవితాంతం కాయకష్టం చేసి రూపాయి రూపాయి కూడబెట్టారు. సొంతిల్లు ఉంటే అద్దె కట్టాల్సిన అవసరం లేకుండా తిన్నా తినకున్నా ఎలాగోలా బ్రతికేయవచ్చు అని ఆలోచించారు. ఆ ఆలోచనను కొందరు అక్రమార్కులు క్యాష్ చేసుకున్నారు. పేదల కలల సౌధం ఆశలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తక్కువ ధరకు ప్లాట్లు అంటూ ఆశ చూపి వివాదాస్పద భూముల్లో ఇండ్ల జాగలను అంటగట్టి సర్వం దోచుకున్నారు. కొన్నేళ్లుగా ఈ తతంగం జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు వారం క్రితం పేదల ఇండ్లపై దాడి చేశారు. కనీసం ముందస్తు హెచ్చరికలు లేకుండా ఇండ్లను కూల్చివేశారు. ఈ కూల్చివేతల వ్యవహారం జరిగి వారం రోజులు దాటుతున్న తమకు న్యాయం జరగక పోవడంతో ఏం చేయాలో పాలుపోక బిక్కుబిక్కుమంటున్నారు.

దిశ, పటాన్​ చెరు: అమీన్ పూర్ మండలం ఐలాపూర్ కూల్చివేతల బాధితుల బతుకులు అగమ్య గోచరంగా మారాయి. కష్టం చేసి సంపాదించిన డబ్బులు పెట్టి కొన్న ఇండ్లు కూల్చివేయడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రభుత్వం స్పందించి తమకు సహాయం చేస్తారన్న నమ్మకంతో ఎదురు చూస్తున్నారు.

గుట్టకు ఒక్కరు పుట్టకు ఒకరు..

కొంత మంది అక్రమార్కుల ధన దాహానికి సర్వం కోల్పోయిన ఐలాపూర్ బాధితుల గోసాలు అన్ని ఇన్ని కావు. తమ స్థిర నివాసాలను కనీస కనికరం లేకుండా అధికార యంత్రాంగం కూల్చివేయడంతో పిల్లలు, తల్లులు గుట్టకొక్కరు, పుట్టకొక్కారు అన్నట్లు తల దిక్కు చెదిరిపోయారు. తమ జీవితాన్ని ధారపోసి నిర్మించుకున్న ఇండ్లు తమ కండ్ల ముందే కూలిపోవడంతో ఇప్పటికి ఆ షాక్ నుండి తెరుకోలేకపోతున్నారు. అటు సంపాదించిన డబ్బు, ఇటు ఇండ్లు పోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పొట్ట చేత పట్టుకుని మహా నగరానికి వచ్చిన తమకు తలదాచుకోవడానికి నిలువ నీడ లేకపోవడంతో చాలా మంది తిరిగి సొంత గ్రామాలకు పయనమవుతున్నారు. సొంత ఊరిలో ఉన్నది అమ్ముకుని ఇక్కడ ఇండ్లను కొన్న పేదల బతుకులు అయితే మరి దుర్భరంగా మారాయని చెప్పవచ్చు. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించి తమకు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు.

కోట్లు దోచుకున్న దొంగల సంగతేంది..

ఐలాపూర్ వివాదాస్పద భూములలో ప్లాట్లను సామాన్యులకు అంటగట్టి కోట్లు దోచుకున్న దొంగల విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. గత కొన్నేండ్లుగా పెద్ద ఎత్తున ఈ భూ దోపిడీ బాగోతం జరుగుతున్న అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇదే అదునుగా రెచ్చిపోయిన అక్రమార్కులు, దళారుల సహాయంతో వివిధ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాలకు పెద్ద ఎత్తున ఇండ్ల జాగాలను విక్రయించారు.

ఎవరొచ్చినా తామున్నామని భరోసా ఇస్తూ ఇండ్ల నిర్మాణాలను మొదలు పెట్టించారు. వందల కోట్ల వ్యాపారం చేసి పలాయనం చిత్తగించారు. రెండేండ్లు ఇటు వైపు చూడని అధికారులు ఉన్నట్టుండి పేదల మీద ప్రతాపం చూపి ఇండ్లను కూల్చివేశారు. అధికార యంత్రాంగం ముందు నుంచే ఈ వ్యవహారం పై కన్నేసి అక్రమాలను అపి ఉంటే 300 కుటుంబాల బతుకులు రోడ్డున పడేవి కాదని ఆవేదన చెందుతున్నారు.

అక్రమార్కుల ఆట కట్టించండి..

మమ్మల్ని మోసం చేసి వందల కోట్లు సంపాదించిన అక్రమార్కుల పని పట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తాము ఆ భూములను కబ్జా చెయ్యలేదని, తమ సర్వస్వం ధారపోసి సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి ప్లాట్లను కొన్నామని చెబుతున్నారు. అధికారులే తమ ఇండ్లకు ఇంటి నంబర్లు, కరెంట్ మీటర్లు జారీ చేశారని తెలిపారు. అయితే మొదట్లో ఈ వ్యవహారం పై నోరు మెదపని అధికారులు ఇప్పుడు ఉన్నట్టుండి తమ మీద పడి ఇండ్లను కూల్చారని వాపోతున్నారు. తమ మీద పని చేసిన అధికారుల అధికారులు తమను దోచుకున్న దొంగల మీద ఎందుకు పని చేయడం లేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమను సర్వం దోచుకున్న అక్రమార్కుల పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇప్పించాలని చేతులెత్తి వేడుకుంటున్నారు. అయితే ఈ తతంగం జరిగి వారం గడుస్తున్నా అక్రమార్కుల మీద ఎటువంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

ఐలాపూర్‌ని సందర్శించిన మానవ హక్కుల కార్యకర్తలు

మానవ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న మానవ హక్కుల కార్యకర్తలు శనివారం ఐలాపూర్ తండా ను సందర్శించారు. బాధితులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. పేదల పై అర్ధ రాత్రి దౌర్జన్యంగా దాడి చేసి ఇండ్లు కూల్చివేసిన ఘటన సరికాదని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కనీసం ముందస్తు హెచ్చరిక లేకుండా ఇండ్లను కూల్చడం, పోలీసులతో బాధితుల పై దాడి చేయడం పై విస్మయం వ్యక్తం చేశారు. జరిగిన ఘటన పై వెంటనే జాతీయ మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించి బాధితుల తరుపున పోరాడతామని తెలియచేశారు.

ముఖ్యమంత్రి దృష్టికి వ్యవహారం

ఐలాపూర్ భూ వివాదం, పేదల ఇండ్లను కూల్చివేసిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ దృష్టికి పలువురు బీ అర్ ఎస్ నాయకులు తీసుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగం వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వివరాలను ఇంటెలిజెన్స్ ద్వారా ప్రగతి భవన్ వర్గాలు సేకరిస్తున్నట్లుగా సమాచారం వస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ వ్యవహారం నడుస్తున్న అధికార యంత్రాంగం మౌనంగా ఉండడం పై ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది.

ఎన్నికల సంవత్సరంలో జరిగిన ఈ వ్యవహారంతో ప్రభుత్వానికి, బీ అర్ ఎస్ పార్టీకి జరిగే నష్టం పై ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇదేమైనా గత వారం రోజుల నుంచి బాధితులు తీవ్ర అవస్థలు పడుతున్న ఇప్పటివరకు బాధితుల విషయంలో న్యాయం జరగడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కలగజేసుకొని ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి విచారణకు ఆదేశించి తమకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Next Story