- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అనాధ పిల్లను కలెక్టర్ అప్పగించాడు.. సిబ్బంది వదిలేశారు

దిశ, పాపన్నపేట : తల్లిదండ్రులు ఎవరూ లేని ఒక విద్యార్థినిని జిల్లా కలెక్టర్ తీసుకువచ్చి పాపన్నపేట కేజీబీవీ లో జాయిన్ చేస్తే... సంబంధిత కేజీబీవీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ విద్యార్థి అదృశ్యమైన సంఘటన బుధవారం పాపన్నపేట కేజీబీవీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెదక్ బాల సదనంలో అనాధగా ఉన్న ఒక బాలికను దయార్ద హృదయుడైన మెదక్ జిల్లా కలెక్టర్ తీసుకువచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీ హాస్టల్లో ఎనిమిదో తరగతిలో జాయిన్ చేశాడు. ఆ బాలికను ఎంతో జాగ్రత్తగా చూసుకోవలసిన కేజీబీవీ అధికారులు కనీసం పట్టించుకోలేదు. ఆ విద్యార్థిని బుధవారం ఉదయం మాయమైన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అయితే ఇటీవల ఎస్ఒగా బాధ్యతలు చేపట్టిన బాల లక్ష్మి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం మూలంగానే ఆ బాలిక అదృశ్యమైందని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది నైట్ డ్యూటీకి గైర్హాజరు అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఒకరిద్దరు తప్ప మిగతా వారు సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల చుట్టూ పూర్తిగా దుర్భేద్యమైన ప్రహరీ రక్షణ గోడ ఉన్నప్పటికీ ఆ విద్యార్థి ఉదయం అటెండెన్స్ తీసుకోగానే అదృశ్యం అవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయమై సంబంధిత సిబ్బంది జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు బాల సదనం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని సమగ్ర విచారణ జరుపుకున్నారు. ఒక మైనర్ బాలిక మాయమవడంతో ఈ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.