- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలుగుదేశం పిలుస్తోంది.. రా..కదలిరా..!
దిశ బ్యూరో సంగారెడ్డి/ సిద్దిపేట ప్రతినిధి: తెలుగుదేశం పిలుస్తోంది..రా కదలిరా.. అప్పుడెప్పుడో పార్టీ స్థాపించిన రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇచ్చిన పిలుపు ఇది. ఈ పిలుపుతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభంజనం వచ్చింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో తెలంగాణలో టీడీపీ దాదాపు కనుమరుగయ్యే స్థితికి చేరిన విషయం తెలిసిందే. అలా అప్పుడెప్పుడే వినిపించిన పిలుపు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పుడు మళ్లీ వినిపిస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ బాధ్యతలు చేపట్టడం, ఖమ్మంలో చంద్రబాబు సక్సెస్ కావడంతో జిల్లాలో బలోపేతంపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాతకాపులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. రండి మళ్లీ టీడీపీలో కలిసి పని చేసుకుందామని ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఆహ్వానాలకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఏ మేరకు స్పందన రానున్నదనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
పార్టీలో చేరండి.. కలిసి పని చేసుకుందాం..
రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేయడంపై అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్లు ఇటీవల జరిగిన పరిణామాలు స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన నియామకం తర్వాత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ నిర్వహించగా సక్సెస్ కూడా అయ్యింది. దీంతో ఇక అన్ని జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నది.
గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల పాత కాపులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. గతంలో పార్టీలో పనిచేసిన వారికి ప్రత్యేకంగా ఫోన్లు చేస్తూ రండి తిరిగి టీడీపీలో చేరండి అని ఆహ్వానిస్తున్నారు. కలిసి పని చేసుకుందాం, పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికీ అన్ని గ్రామాల్లో టీడీపీ అభిమానులు ఉన్నారని వారితో మళ్లీ టీడీపీకి పూర్వ వైభవం తీసుకు వద్దామని కోరుతున్నారు. గతంలో పనిచేసిన సీనియర్ నాయకులు మొదలుకుని కింది వారికి కూడా ఫోన్లు వస్తున్నట్లు సమాచారం.
జిల్లా పార్టీ ఆఫీసులు, కారు కూడా
అన్ని జిల్లాలో జిల్లా పార్టీ ఆఫీసులు ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసిన తరువాత జిల్లా అధ్యక్షుడు ఓ కారు ఇవ్వడంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా పార్టీ చేసుకుంటుందని అధిష్టానం ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలో గుర్తింపు లేదని, టీడీపీలో ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు ఇస్తామని అధిష్టానం నుంచి హామీలు ఇస్తున్నారు. బలమైన నాయకులను జిల్లా అధ్యక్షులను చేయాలని చూస్తున్నామని మంచి అవకాశాన్ని వదులుకోవద్దని పదేపదే కోరుతున్నట్లు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ నాయకుడు(ప్రస్తుతం బీఆర్ఎస్) దిశ ప్రతినిధితో చెప్పుకొచ్చాడు. జిల్లా కమిటీలతో పాటు అన్ని కమిటీలు వేయడానికి పార్టీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్పంధన అంతంతే
టీడీపీలో చేరమని పార్టీ ఆఫీస్ నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ పెద్దగా స్పందన రావడం లేదని తెలుస్తోంది.ఇప్పటికే పార్టీలు మారామాని, ఇప్పుడు మరోసారి టీడీపీలో చేరితో ప్రజల్లో విలువ పోతుందని పలువురు సూటిగా కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. కొందరు మాత్రం కొంత సమయం తీసుకుని చెబుతామని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుత పార్టీలో గుర్తింపు లేని మాత్రం తాము నేరుగా వచ్చి కాసాని జ్ఞానేశ్వరును కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పినట్లు తెలిసింది. మూడు జిల్లాలో చాలా మంది పాతకాపులకు ఫోన్లు రాగా.. కొందరి నుంచి మాత్రమే మిశ్రమ స్పందన వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. టీడీపీ మొదలు పెట్టిన తెలుగుదేశం పిలుస్తోంది..రా..కదిలిరా ..నినాదానికి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏ మేరకు స్పందన రానున్నదే వేచి చూడాల్సి ఉంది.