రోగిపై దాడి చేసిన వైద్యుడి సస్పెన్షన్

by Shiva |
రోగిపై దాడి చేసిన వైద్యుడి సస్పెన్షన్
X

ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందికి మెమోలు జారీ

దిశ, నారాయణఖేడ్: నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈనెల 8న వైద్యం కోసం వచ్చిన ఒక యువకుడిపై వైద్యుడు దాడి చేసిన ఘటన పాఠకులకు విధితమే. మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన డాక్టర్ ఇజ్రాయేలు నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో నారాయణఖేడ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో నివాసం ఉంటున్న హట్ట్యానాయక్ తాండకు చెందిన మేఘావత్ హన్మనాయక్ ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుపై రాయి పడింది.

దీంతో హన్మనాయక్ చికిత్స నిమిత్తం నారాయణ ఖేడ్ ఏరియా ఆసుపత్రికి వచ్చాడు. అంతకు ముందు తన భార్య మేఘావత్ చాంగుబాయి తీవ్ర జ్వరంతో అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో ఆసుపత్రికి వచ్చిన హన్మనాయక్ తన భార్య దగ్గర తోడుగా ఎవరూ లేరని, ఆమెకు సెలైన్లు పెడుతున్నారని అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తెలిపాడు.

తాను లైన్లో నిలబడలేనని, తనకు తొందరగా ఓపీ స్లిప్ ఇస్తే.. డాక్టర్ తో చెక్ అప్ చేయించుకుని తన భార్య దగ్గరకు వెళ్లానన్నాడు. దీంతో అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ ఇజ్రాయేలు వాచ్ మెన్ సత్తయ్య చేతిలో ఉన్న కర్ర తీసుకుని హన్మనాయక్ ను రూంలోకి తీసుకెళ్లి తలుపులు వేసి ఇష్టానుసారంగా కొట్టా‌రు. దీంతో హన్మనాయక్ రెండు చేతులకు, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.

ఇదే డాక్టర్ విషయంలో గతంలో కూడా ఓ సారి మెమో జారీ చేశారని, తనను ఇబ్బందులకు గురి చేసిన డాక్టర్ ఇజ్రాయేలునుపై చర్యలు తీసుకోవాలంటూ మెగావత్ హన్మనాయక్ నాయక్ విలేకరుల ఎదుట బోరున విలపించాడు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ శరత్ ఈనెల 22న కాంట్రాక్ట్ డాక్టర్ ఇజ్రాయేలును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైద్యుడికి సహకరించిన సెక్యూరిటీ సిబ్బంది సత్యనారాయణ, రాజులకు మెమో జారీ చేశారు.

Advertisement

Next Story