నిద్రపోతున్న నిఘా నేత్రాలు

by Naresh |
నిద్రపోతున్న నిఘా నేత్రాలు
X

దిశ, దౌల్తాబాద్: దౌల్తాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అమర్చిన సీసీ కెమెరాలు కొద్దిరోజులుగా పనిచేయడం లేదు. నిఘా నేత్రంగా పనిచేయాల్సిన సీసీ కెమెరాలు నిద్రావస్థలో వెక్కిరిస్తున్నాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. కానీ, 90శాతం కెమెరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. ప్రతి కదలికను పర్యవేక్షించాల్సిన సీసీ కెమెరాలు నిద్రావస్థలో చేరాయి. అడపాదడపా మినహా మరెక్కడా పనిచేయడం లేనట్లుగా స్పష్టమవుతోంది.

దొంగతనాలకు ఆస్కారం:

జిల్లాలో ఇటీవల దొంగల బెడద ఎక్కువైంది. పట్టపగలే ఇండ్లు, దుకాణాల తాళాలు పగలగొట్టి నగదు, ఆభరణాలను అపహరిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. అయితే దొంగలను పట్టుకోవడంలో మాత్రం జాప్యం జరుగుతోంది. ఇందుకు సీసీ కెమెరాలు నిరూపయోగంగా మారడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. సీసీ కెమెరాల నిర్వహణ సక్రమంగా ఉంటే దొంగతనాలు చేయడానికి సైతం తర్జనభర్జన పడే పరిస్థితి ఉండేది. కానీ యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలోని చాలాచోట్ల ఇటీవల దొంగతనాలు జరగడమే ఇందుకు నిదర్శనం. ప్రధాన రహదారులపై మినహాయిస్తే గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు స్తంభాలపై వెక్కిరిస్తున్నాయనే చెప్పాలి.

సీపీ దృష్టిసారిస్తేనే..

జిల్లా నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాధ తనదైన ముద్ర వేస్తున్నారు. అక్రమ దందాల పై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కులకు సవాల్ విసురుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలోనూ అన్ని కోణాల్లో పర్యవేక్షిస్తున్నారు. అయితే సీసీ కెమెరాల నిర్వహణపై ఆమె ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మతు చేయించడం, కొత్త కెమెరాలను ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో ఏర్పాటు చేసినట్లుగానే దాతలు, ప్రజాప్రతినిధుల సహకారంతో నైనా క్షేత్రస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పునరుద్ధరిస్తాం…



మండల పరిధిలో అక్కడక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు వీటి నిర్వహణ, పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేస్తాం. వ్యాపారస్తులు,ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి వీటి మరమ్మతు,నిర్వహణ అంశాలను చర్చిస్తాం. వీలైనంత త్వరగా దాతల సహకారంతో సీసీ కెమెరాలు మరమ్మత్తులు చేయిస్తాం. దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఉంది.

శ్రీరామ్ ప్రేమ్ దీప్, ఎస్సై, దౌల్తాబాద్.

Advertisement

Next Story

Most Viewed