సిద్దిపేటలో మోడల్ ఆటోనగర్.. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు

by Mahesh |
సిద్దిపేటలో మోడల్ ఆటోనగర్.. అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : వాహనాలకు సంబంధించిన అన్ని రిపేర్లు ఒకే చోట అందించేలా అత్యాధునిక ఆటోనగర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. డేంటింగ్, పెయింటింగ్, రెగ్జిన్ వర్క్ , ఎలక్ట్రికల్ వర్క్, పంచర్, రేడియటర్ ఇలా వాహనాలకు సంబంధించిన అన్ని రకాల రిపేర్లు ఒకే చోట లభించేలా మందపల్లి శివారు పారిశ్రామిక పార్క్ లో 25 ఎకరాల స్థలంలో రూ.15 కోట్లతో మోడల్ ఆటో నగర్ నిర్మాణానికి మంత్రి హరీశ్​ రావు శ్రీకారం చుట్టారు. సిద్దిపేట పట్టణం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శివారు ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.

పట్టణ శివారులో ఉన్న మెకానిక్ షెడ్లు వద్ద ఇండ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో మెకానిక్ షెడ్ల వద్ద నిలిపి ఉంచి వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతోంది. సిద్దిపేటలో ఇప్పటికే పొన్నాల వద్ద ఒక ఆటో నగర్ ఉండగా, పెరిగిన అవసరాలకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలతో మరో మోడల్ ఆటోనగర్ నిర్మాణానికి మంత్రి హరీశ్​రావు సంకల్పించారు. ఆలోచన వచ్చిందే తడవు పట్టణ శివారు పారిశ్రామిక వాడలో 25 ఎకరాల్లో 400 మెకానిక్ షెడ్లు నిర్మించుకునేలా రూ.15 కోట్లతో విద్యుత్, విశాలమైన రోడ్లు, మంచినీటి సౌకర్యాలతో మోడల్ ఆటోనగర్ నిర్మాణం చేపట్టారు. మోడల్ ఆటో నగర్‌లోని ప్లాట్లను మంత్రి హరీశ్​రావు చేతుల మీదుగా త్వరలో మెకానిక్ లకు అందజేయనున్నారు.

మెకానిక్‌ల మేలు కోసమే.. మంత్రి హరీశ్​రావు

సిద్దిపేట జిల్లా కేంద్రం కావడం.. రెండు జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మెకానిక్‌ల మేలు కోసం మోడల్ ఆటోనగర్ ఏర్పాటు చేయబోతున్నాం. విశాలమైన రోడ్లు, మంచి నీరు, విద్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. మెకానిక్ లకు గొప్ప ఆస్తి ఇస్తున్న అనే సంతృప్తి ఉంది.

మంత్రి హరీశ్​రావుకు రుణపడి ఉంటాం

అత్యాధునిక సౌకర్యాలతో మోడల్ ఆటో నగర్ నిర్మించడంతో పాటుగా ప్లాట్లను కేటాయిస్తున్నందుకు మంత్రి హరీశ్ రావుకు రుణపడి ఉంటామని ఆటో నగర్ అసోసియేషన్ ప్రతినిధులు అసన్, ఆర్ కె నర్సింలు అన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా అన్ని సౌకర్యాలు ఆటో నగర్ సిద్దిపేట నిర్మాణం కావడం సంతోషంగా ఉంది. ఆటో నగర్ అసోసియేషన్, కార్మికుల పక్షాన మంత్రి హరీశ్​రావు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed