అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్లు

by Kalyani |
అంగన్‌వాడీలో కుళ్లిన గుడ్లు
X

దిశ , కంగ్టి : సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ క్లస్టర్ లోని ముర్కుజల్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌ ఇచ్చే మామూళ్లకు ఆశపడే అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. గుడ్లు, పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తోంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది. ఒక ట్రేలో ఉన్న గుడ్ల బరువు దాదాపు కిలోన్నర ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరువున్న, కుళ్లిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి గుడ్డుపై ప్రభుత్వ లోగోతో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కాంట్రాక్టర్లు మాత్రం చేతివాటాన్ని ప్రదర్శిస్తునే ఉన్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు : సీడీపీఓ సుజాత

ముర్కుజల్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లిన, నాసిరకం గుడ్ల పై వివరణ అడగగా ఎవరో ఆకతాయి పాత గుడ్ల వీడియో తీసి గ్రూప్ లో షేర్ చేస్తున్నారు అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిన, సైజ్‌ తక్కువగా ఉన్న కోడి గుడ్లు సరఫరా చేయకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నామన్నారు. కుళ్లిన లేదా నాసిరకం గుడ్లు వస్తే తీసుకోకుండా వెనక్కి అంగన్‌వాడీ టీచర్లకు పంపుతున్నారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed