ధరణి ఆర్జీలన్నింటిని వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్ డాక్టర్ శరత్

by Kalyani |
ధరణి ఆర్జీలన్నింటిని వేగవంతంగా పరిష్కరించండి: కలెక్టర్ డాక్టర్ శరత్
X

దిశ , సంగారెడ్డి: ధరణిలో వచ్చిన ఆర్జీలన్నింటిని ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ధరణి, భూ సేకరణ, బౌండరీ సమస్యల పరిష్కారం, మున్సిపల్ ఏరియాలలో భూ సమీకరణ, జీఓ 59, తదితర అంశాలపై రెవిన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధరణి మాడ్యుల్స్ లో వచ్చిన ఆర్జీలన్నింటినీ ఈ నెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టి పూర్తిస్థాయిలో పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు.

జిల్లాలోని అన్ని మున్సిపల్ ఏరియాలలో భూ సమీకరణకు (ల్యాండ్ పూలింగ్) భూములను గుర్తించాలని, ఈ నెల 27వ తేదీలోగా మున్సిపల్ కమిషనర్లు తహసీల్దార్లతో సమన్వయం చేసుకొని భూ సమీకరణ పూర్తి చేయాలని సూచించారు. నిమ్జ్, మెడికల్ డివైస్ పార్క్, బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి కావాలన్నారు. టీఎస్ఐఐసీ భూమి హద్దులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ, సంబంధిత తహసీల్దార్లకు సూచించారు.

గ్రామం వారీగా ఇండ్ల స్థలాలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి వివరాలను అందించాలని తెలిపారు. మున్సిపల్ బడ్జెట్ సెషన్స్ మార్చి మూడు లోగా పూర్తి కావాలని తెలిపారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అవినాష్ నాయక్, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed