వానాకాలం.. ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం

by Mahesh |
వానాకాలం.. ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: వానాకాలం వరి ధాన్యం సేకరణకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ధాన్యం సేకరణలో పారదర్శకథ, నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం తీసుకొచ్చిన రైతులకు మద్దతు ధర, లోడింగ్, అన్ లోడింగ్ తదితర సమస్యలు పునరావృతం కాకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళుతున్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 417 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించిన నేపథ్యంలో తేమ యంత్రాలు, ఎలక్ట్రానిక్‌ కాంటాలు, టార్పాలిన్ కవర్లు, గన్నీ బ్యాగులు సమకూర్చుకునే పనిలో సంబంధిత శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి ప్రాజెక్టుల నిర్మాణంతో రైతులు వరి సాగుకు మొగ్గు చూపారు.

వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా 3లక్షల 68 వేల 461 లక్షల ఎకరాల్లో ( దొడ్డు రకం వరి 3 లక్షల 4 వేల ఎకరాల్లో, సన్న వడ్లు 64 వేల ఎకరాల్లో ) వరి సాగు చేశారు. ఈ మేరకు సుమారు 8 లక్షల 47 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ( దొడ్డు వడ్లు 7 లక్షల మెట్రిక్ టన్నుల, సన్న రకం వడ్లు లక్ష 47 వేల మెట్రిక్ టన్నుల) దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేశారు. అందులో 4లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ( దొడ్డు రకం వరి ధాన్యం 3 లక్షల 25 వేలు మెట్రిక్ టన్నులు, సన్న రకం వరి ధాన్యం 75 వేలు మెట్రిక్ టన్నుల) కొనుగోలుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్ కు రూ. 2320, కామన్ రకం వరి ధాన్యం క్వింటాల్ కు రూ.2300 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు ఈ సీజన్ నుంచి సన్న వడ్ల కు రూ.5 వందల బోనస్ చెల్లించనున్నారు. అయితే సన్న రకం ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద తీసుకుంటారా, గ్రేడ్ ఏ కింద తీసుకుంటారా అనే విషయమై స్పష్టత లేదు.

417 కొనుగోలు కేంద్రాలు

వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 417 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 211, పీఎసీఎస్ ఆధ్వర్యంలో 2 వందల, మెప్మా ఆధ్వర్యంలో 6 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అందులో సన్న రకం ధాన్యం కొనుగోలు కోసం జిల్లా లో 60 నుంచి 70 సెంటర్లకు ఏర్పాటు చేయనున్నారు. సన్న రకం ధాన్యాన్ని నిర్ధారించేందుకు వంద వరకు మైక్రో మీటర్లు తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గన్నీ బ్యాగుల కొరత

వరి ధాన్యం సేకరణలో ప్రతి సీజన్ లో గన్నీ బ్యాగుల కొరత ప్రధాన సమస్యగా ఉంటుంది. వానాకాలం సీజన్ కు సంబంధించి జిల్లాలో కోటి గన్నీ బ్యాగులు అవసరం ఉంటాయని అధికారులు లెక్క తేల్చారు. ఈ మేరకు 40 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరో 60 లక్షల గన్నీ బ్యాగులకు గాను కొత్తవి 35 లక్షలు, పాతవి 25 లక్షల గన్నీ బ్యాగులు కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. గన్నీ సంచులు టార్ఫాలిన్, తేమ గెలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు వంటి యంత్రాలను సిద్ధం చేస్తున్నాం. సన్న రకం ధాన్యాన్ని నిర్ధారించేందుకు మైక్రో మీటర్లను తెప్పిస్తున్నాం.-పౌర సరఫరాల సంస్థ డీఎం ప్రవీణ్

Advertisement

Next Story