భర్తపై భార్య కత్తితో దాడి..

by Aamani |
భర్తపై భార్య కత్తితో దాడి..
X

దిశ, వైరా : వైరా మండలంలోని గొల్లపూడి గ్రామంలో శుక్రవారం ఉదయం భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. గొల్లపూడి గ్రామానికి చెందిన పోరాళ్ళ రవిపై అతని భార్య లక్ష్మి కత్తితో దాడి చేసింది. గత సంవత్సర కాలం క్రితం వరకు రవి విద్యాశాఖలో వైరా మండలం రెబ్బవరం క్లస్టర్ సీఆర్పీ గా పని చేశారు. అయితే అతను మద్యం సేవించి విధులకు హాజరవుతుండటంతో అధికారులు అతన్ని విధుల్లో నుంచి తొలగించారు. గత మూడు సంవత్సరాలుగా రవి అతని భార్య లక్ష్మి మధ్య నిరంతరం కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 22వ తేదీన రవి అయ్యప్పమాలను ధరించాడు. అయితే తన ఇంటి పేరు ఉన్న వారు చనిపోవడంతో గత ఐదు రోజుల క్రితం మాల విరమణ చేశాడు.

అనంతరం రవి భార్యతో నిరంతరం గొడవకు దిగుతున్నాడు. అయితే భర్త వేధింపులను తట్టుకోలేక భార్య లక్ష్మి శుక్రవారం ఉదయం రవి పై కత్తితో దాడి చేసింది. శుక్రవారం ఉదయం మద్యం సేవించిన రవి ఇంటికి వెళ్లి భార్యతో గొడవకు దిగాడు. అంతేకాకుండా భార్యపై దాడి చేయడంతో ఆ సమయంలో కోపోద్రిక్తురాలైన ఆమె ఇంట్లో ఉన్న కత్తితో అతనిపై దాడి చేసింది. దీంతో అతనికి తీవ్రగాయాలై రక్తస్రావం అయింది. వెంటనే అతనిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైరా పోలీసులు వెంటనే గొల్లపూడి గ్రామానికి వచ్చి లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. వైరాలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో టీచర్ గా పని చేస్తున్న ఆమెను భర్త రవి అనుమానించి చిత్రహింసలకు గురి చేయడం వల్లే తాను అతనిపై దాడి చేసినట్లు భార్య లక్ష్మీ పోలీసులకు తెలిపినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed