సిద్దిపేట జిల్లాలో రాజకీయ వేడి

by Mahesh |
సిద్దిపేట జిల్లాలో రాజకీయ వేడి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: కవ్వింపులు.. కౌంటర్లతో సిద్దిపేట జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అధికారంలోకి వస్తే హుస్నాబాద్ కోహెడ మండలాలను పూర్వపు జిల్లాలో కలుపుతామని ఇచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్ గా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా.. దేనికైనా టైం వస్తుందని అమాత్యుని కౌంటర్ తో విలీన మండలాల పంచాయతీ మరో మారు తెర పైకి వచ్చింది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా ప్రతిపక్షాలు కవ్వింపు చర్యలు .. కాంగ్రెస్ కౌంటర్లు...సవాళ్లు.. ప్రతి సవాళ్ల పై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రజలకు పాలన సౌకర్యాలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో నాటి బీఆర్ఎస్ సారధ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలో, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలను హన్మకొండ జిల్లాలో, చిగురుమామిడి, సౌదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలో కలిపారు. అదే విధంగా కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలంను బెజ్జంకి గన్నేరువరం మండలాలుగా విభజించి, బెజ్జంకి మండలంను సిద్దిపేట జిల్లాలో కలిపారు. ఇదిలా ఉంటే కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలంను సిద్దిపేట జిల్లాలో కలుపడం పై అప్పటి నుంచే నిరసనలు వ్యక్తం చేస్తూ తిరిగి కరీంనగర్ జిల్లాలోనే కలపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

హామీలు అమలు చేయాల్సిందే..

పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి హుస్నాబాద్ పర్యటన సందర్భంగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్‌కు మద్దతు తెలిపారు. అదే విధంగా రేణిగుంట లో నిర్వహించిన ప్రచార సభలో అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బెజ్జంకి మండలాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారు. దీనికి తోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారు. బీజేపీ నాయకులు సైతం కరీంనగర్ జిల్లాలో కలుపాలనే డిమాండ్ కు మద్దతు పలికారు. హామీలను అమలు చేయాల్సిందే అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోహెడ ఎంపీటీసీల పదవీకాలం ముగింపు సందర్భంగా ఈ విషయం పై మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎంపీటీసీలు వినతి పత్రం అందజేశారు.

సవాళ్లు ప్రతి సవాళ్లు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేస్తుండగా.. డిలిమిటేషన్ ప్రక్రియలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాస్త్రీయంగా నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారు. హామీలు అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు సవాళ్లకు దేనికైనా టైం వస్తుందని మంత్రి కౌంటర్లు.. ప్రజల మనోభావాలు వెరసి రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed