- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుబ్బాక కాంగ్రెస్‌లో ''త్రిముఖ'' పోరు.. కత్తి కార్తీక ఎంట్రీతో మరింత వేడెక్కిన రాజకీయం!
దిశ బ్యూరో, సంగారెడ్డి: రాష్ట్ర స్థాయిలో పీసీసీ నుంచి మొదలుకుని కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. ఎవరి గ్రూపులు వారివే, ఎవరి ప్రచారాలు వారివే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. సరైన నాయకత్వం లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో లీడర్లు ఎవరికి వారే అధిష్టానం వద్ద తనకే గుర్తింపు ఉన్నదని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు హాథ్ సే హాథ్ జోడో యాత్ర లేదా మరో పేరుతో పాదయాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యాత్రలు కొన్ని చోట్ల కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఇదే కన్ఫ్యూజన్ నెలకొన్నది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర పేరుతో పిబ్రవరి 1 నుంచి ఊరూరు తిరుగుతున్నారు. శ్రీనివాస్ రెడ్డితో తనకేం సంబంధం అన్నట్లుగా మరో నాయకుడు శ్రావణ్ కుమార్ రెడ్డి జోడోయాత్ర పేరుతో అక్కడక్కడ తిరిగిపోతున్నారు. వీళ్లద్దరితో సంబంధం లేకుండా ఇప్పుడు కత్తి కార్తీక జోడో యాత్రకు సిద్దమయ్యారు. దుబ్బాకలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకున్న ఆమె యాత్ర పేరుతో ఊరూరు పాదయాత్ర చేయనున్నట్లు చెబుతున్నారు. లీడర్ల యాత్రలు బాగానే ఉన్నప్పటికీ ఎవరి వెంట నడవాలో తెలియక కార్యకర్తలు జుట్టుపీక్కుంటున్నారు. దుబ్బాక కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.....
దుబ్బాక ఆత్మగౌరవం పేరుతో 'చెరుకు'..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ యాత్ర పేరుతో పిభ్రవరి 1 నుంచి ఊరూర పాదయాత్ర చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల సాధకబాదలు తెలుసుకుంటూ కాంగ్రెస్ వస్తే అన్నింటికి పరిష్కారం లభిస్తుందని చెబుతూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తున్నాడని చెప్పుకోవచ్చు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. తొగుట మండలం నుంచి మొదలైన యాత్ర ఆ మండలం పూర్తి చేసుకుని మరో మండలం వైపు వస్తున్నది. గ్రామాల్లో ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి కూడా ఆధరణ లభిస్తున్నది. దుబ్బాక కాంగ్రెస్ అంటే చెరుకు శ్రీనివాస్ రెడ్డి అనే స్థాయిలో స్థానికంగా గుర్తింపు ఉన్నది. తండ్రి చెరుకు ముత్యంరెడ్డి నుంచి రాజకీయ పాఠాలు నేర్చుకుని రాజకీయాల్లోకి వచ్చారు.
అలా.. అప్పుడప్పుడు..
కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి కూడా అప్పుడప్పుడు దుబ్బాకకు వచ్చిపోతుంటారు. గతంలో పార్టీ నుంచి సిద్దిపేట ఎంపీగా పోటీ చేసిన విషయం తెలిసిందే. దుబ్బాక కేంద్రంగానే ఆయన రాజకీయాలు చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లో ఉంటూ వీలు దొరికినప్పుడు వస్తుంటారు. ప్రధానంగా ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో నియోజకవర్గానికి వస్తారని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తూ ఉంటారు. అయితే పీసీసీ స్థాయిలో పార్టీలో మాత్రం మంచి గుర్తింపు ఉన్నది. కాగా శ్రావణ్ కుమార్ రెడ్డి కూడా ఇటీవల ఓ గ్రామంలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. స్థానికంగా గ్రామాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ వస్తేనే బతుకులు బాగుపడతాయని ప్రచారం చేసి వెళ్లిపోయారు.
ఇప్పుడు రంగంలోకి 'కత్తి'..
దుబ్బాక ప్రజానీకానీకి కత్తి కార్తీక అంటే బాగా తెలుసు. యాంకర్ అయిన కార్తీక గతంలో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తాను దుబ్బాక కేంద్రంగానే రాజకీయం చేస్తున్నారు. ఓ సారి ఓటమి చెందిన తరువాత ఇక దుబ్బాక వైపు రారేమో అనుకున్నారు. ఆమె మాత్రం దుబ్బాకపైనే ప్రధాన దృష్టి సారించారు. ఇప్పుడు కార్తీక కూడా నియోజకవర్గంలో జోడోయాత్ర మొదలు పెట్టడానికి సిద్ధం అయ్యారు. ఇందుకోసం దుబ్బాకలోనే ఓ ఇల్లును అద్దెకు తీసుకున్నారు. స్థానికంగా ఉండడం లేదనే కార్యకర్తలు ప్రశ్నించకుండా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఈ నెల 12 నుంచి కార్తీక యాత్ర మొదలుపెట్టనున్నట్లు చెబుతున్నారు. కాగా రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ మొత్తం యాత్రలో మొదటి నుంచి చివరి వరకు కత్తి కార్తీక పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. కాంగ్రెస్ పార్టీలోని డిల్లీ నుంచి పీసీసీ వరకు ముఖ్య నాయకులందరితో పరిచయాలున్నాయి. అయితే అమె చేపట్టనున్న పాదయాత్రకు ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉన్నది.
ఎవరికి వారే...తలోదిక్కు యాత్రలు..
చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక..ముగ్గురూ ఎవరికి వారే దుబ్బాకలో రాజకీయం చేసుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిలకు మద్య పచ్చగడ్డి వస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. శ్రావణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కోవర్టు అని, ఆయన ఎప్పుడు చూసిన మంత్రి హరీష్ రావు ఇంట్లోనే ఉంటారని మీడియా ముందు శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఎవరి బాట వారిదే అన్నట్లుగా వారు ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర స్థాయిలోని కాంగ్రెస్ పెద్దలు కూడా ఒకరికి ఓ వర్గం, మరొకరికి మరో వర్గం సపోర్ట్ చేస్తున్నది. ఇదిలా ఉండగా కత్తికార్తీక కూడా ఇద్దరితో ఏ మాత్రం సంబంధం లేకుండానే తాను నమ్ముకున్న కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు పాదయాత్రకు కూడా సిద్దం అయ్యారు.
కార్యకర్తల అయోమయం..
దుబ్బాక కేంద్రంగా కాంగ్రెస్‌లో ముగ్గురు నాయకులు పాదయాత్రలతో పేరుతో గ్రామాల్లోకి రావడంతో ఏ లీడర్ వెంట వెళ్లాల్లో తెలియక పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అయోమయం చెందుతున్నారు. పార్టీ అధిష్టానం వద్ద ఎవరికి గుర్తింపు ఉన్నది..? వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్ ఇస్తారు..? ఎవరి వెంట వెళితే ప్రయోజనం ఉంటుంది..? ఇలా సవాలక్ష ప్రశ్నలు వారిని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ముగ్గురు ఎవరికి వారుగా రాజకీయాలు చేస్తుంటే వారిని సమన్వయపరిచే అధిష్టానం లేకపోవడంపై కార్యకర్తల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. టిక్కెట్ విషయం పక్కన పెట్టి ముగ్గురూ కలిసి యాత్ర చేస్తే పార్టీకి ఆదరణ వస్తుంది కదా అని ఓ సీనియర్ నాయకులు చెప్పుకొచ్చారు. ఎవరికి వారు రాజకీయాలు చేసి కాంగ్రెస్ ను ముందుకు పోనియ్యరని ఆ నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఈ వ్యవహారంపై అధిష్టానం ఏ మేరకు స్పంధిస్తే చూడాల్సి ఉన్నది.