- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేసీఆర్‌కి మల్లన్నసాగర్ యువకుల బహిరంగ లేఖ..

దిశ,గజ్వేల్ రూరల్ : మల్లన్న సాగర్ ముంపు గ్రామాల యువకులు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసి రిజిస్టర్ పోస్టు ద్వారా పంపారు. మీరు సృష్టించిన సమస్యలను మీరే పరిష్కరించాలంటూ అందుకు అనుగుణంగా అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని అభ్యర్తించాలంటూ లేఖలో పేర్కొన్నట్లు యువకులు తెలిపారు. ఇదివరకే గత సంవత్సరం డిసెంబర్ 16న మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలపై పోస్టు ద్వారా బహిరంగ లేఖ రాసినా కూడా దానిపై స్పందించలేదని, అసెంబ్లీలో మాట్లాడలేదని గుర్తుచేశారు.
ఇటీవలే ఫిబ్రవరి 7న మాజీ మంత్రి హరీష్ రావు నిర్వాసితుల సమస్యలపై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కానీ అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలన్నారు. ఎక్కడ మల్లన్నసాగర్ కుంభకోణాలు, అక్రమాలు బయటపడతాయో అన్నట్లుగా అసెంబ్లీలో ప్రస్తావించలేదని భూ నిర్వాసిత గ్రామాల యువకులు ఆరోపించారు. అదేవిధంగా మీ హయాంలో నిర్మించిన రంగనాయక సాగర్, అంతగిరి ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో మీరు దండుకున్న సొమ్మును కాపాడుకోవడానికి మీరు చేసిన అవినీతిని, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే లేఖ రాశారని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు హరీష్ రావు మరియు ఆయన టీమ్ సభ్యులు ఒక్కసారైనా ఆర్ అండ్ ఆర్ కాలనీకి రాలేదని, ఎక్కడో కూర్చొని లేఖ రాసే బదులు నిర్వాసితుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి నిర్వాసిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని, చేసిన పాపాలను కడుక్కోవాలని లేఖ ద్వారా పేర్కొన్నారు. ముంపు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే చివరికి అంతిమసంస్కారాలను జరుపుకోవడానికి స్మశాన వాటికలను కూడా కేటాయించలేదని, దీంతో ముస్లింలు, క్రిస్టియన్లు, హైందవ సోదరులు ఇబ్బందులు పడుతున్నారని లేఖ ద్వారా తెలిపారు.
చనిపోయిన వారి ఆత్మలు పీడించే లోపు, వారి ఆత్మలు క్షోభించే లోపు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించేలా చూడాలని కేసీఆర్ ని లేఖ ద్వారా కోరారు. మీకు లేఖ అందాక కూడా స్పందించకుంటే, అసెంబ్లీలో నిర్వాసితుల సమస్యలపై ప్రస్తావించకుంటే భూ నిర్వాసితుల తో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాలైన బ్రాహ్మణ బంజేరుపల్లి, రాంపూర్, లక్ష్మాపూర్, ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, సింగారం గ్రామాల యువకులు పాల్గొన్నారు.