'దిశ' కథనానికి స్పందన.. ఆ షాపులన్నింటికి నోటీసులు

by Manoj |   ( Updated:2022-07-01 15:23:05.0  )
దిశ కథనానికి స్పందన.. ఆ షాపులన్నింటికి నోటీసులు
X

దిశ, సంగారెడ్డి : నేషనల్ హైవేకి ఇరువైపుల గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా మార్బుల్, గ్రానైట్ దుకాణాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే కథనాన్ని జూన్ 10వ తేదీన దిశ కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన అధికారులు కంది గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో నేషనల్ హైవేకి ఇరువైపుల ఉన్న మార్బుల్ దుకాణాలు ఎన్ని ఉన్నాయో లెక్కలు తీశారు. మొత్తం 15 దుకాణాలు ఉండగా అధికారులు మాత్రం 12 ఉన్నాయనే లెక్కలు వేసి వాటికి మాత్రమే పంచాయతీ అనుమతి తీసుకోవాలని, అదే విధంగా పన్ను చెల్లించాలని.. డిమాండ్ నోటీసులు పంచాయతీ కార్యదర్శి జారీ చేశారు.

అధికారులు తేల్చిన 12 దుకాణాల్లో ఆరు దుకాణాల యజమానులు నోటీసులకు స్పందించి అనుమతి తీసుకోవడంతో పాటు పన్నులు చెల్లించారు. మరో ఆరు దుకాణాలు నోటీసులకు స్పందించడం లేదు. ఓ వైపు నోటీసులు జారీ చేస్తుంటే మరో వైపు ఎలాంటి అనుమతి తీసుకోకుండానే నూతనంగా మరో మార్బుల్ దుకాణాన్ని ప్రారంభించారు. నోటీసులు ఇచ్చే అధికారులకు కొత్తగా ప్రారంభించిన గ్రానైట్, మార్బుల్ దుకాణం కనిపించలేదా అంటూ గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఆదాయానికి గత కొన్ని సంవత్సరాలుగా గండి కొడుతున్న మార్బుల్, గ్రానైట్ దుకాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

నోటీసులు ఇచ్చాం: కంది గ్రామ పంచాయతీ కార్యదర్శి, విద్యాధర్ గౌడ్

కంది గ్రామ పంచాయతీ పరిధిలో నేషనల్ హైవేకు రోడ్డుకిరువైపులా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గ్రానైట్, మార్బుల్ దుకాణాలకు ఎన్ని ఉన్నాయో గుర్తించాం. మొత్తం 12 ఉన్నాయి. ఆ దుకాణాలకు నోటీసులు అందించాం. అందులో ఆరు దుకాణాలు అనుమతి తీసుకున్నాయి. మిగతా దుకాణాలకు 15 రోజుల సమయం ఇచ్చాం. అయినా స్పందించకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఎలాంటి దుకాణాలు ఏర్పాటు చేయొద్దు. అలా ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు.

Advertisement

Next Story

Most Viewed