విద్యార్థుల సమస్యల పై ఎమ్మెల్యే తక్షణ స్పందన..

by Sumithra |
విద్యార్థుల సమస్యల పై ఎమ్మెల్యే తక్షణ స్పందన..
X

దిశ, నారాయణఖేడ్‌ : నారాయణఖేడ్‌ మండలం జూకల్ శివారులోని మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర బీసీ గురుకులాన్ని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజీవరెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేయగా పలు సమస్యలు బయటపడ్డాయి. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న ఆయా సమస్యలు వివరించడంతో పాటు, ఎమ్మెల్యే సైతం కొన్ని సమస్యలను గుర్తించి పరిష్కారానికి తక్షణం స్పందించారు. గురుకులం గ్రౌండ్‌లో లైట్లు లేకపోవడంతో రాత్రి వేళ చీకటిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, విషకీటకాలు వచ్చే ప్రమాదం ఉందని తెలపడంతో రాత్రికి రాత్రి హైమాస్ట్‌ లైట్లను ఫిటింగ్‌ చేయించారు. డైనింగ్‌ హాల్‌లో అత్యవసరంగా 4 ఫ్యాన్లు, 8 ట్యూబులను ఏర్పాటు చేయించారు.

చెడిపోయిన 80 ఫ్యాన్లను, ట్యూబులను అతి త్వరలో మరమ్మతులు చేయించి ఫిటింగ్‌ చేయించేలా మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దారం శంకర్‌కు ఆదేశించారు. విద్యార్థులు కనీస అవసరాలకు నీటిని వాడుకొనేందుకు ఇబ్బందులు పడుతుండడంతో 2 వేల లీటర్ల సామర్థ్యం గల రెండు సింటెక్స్‌ ట్యాంకులను ఏర్పాటు చేయించారు. చెడిపోయి వృధాగా పడేసిన ఆర్వో వాటర్‌ ప్లాంటును అతి త్వరలో మరమ్మతులు పూర్తి చేయించి దసరా సెలవులు పూర్తయి విద్యార్థులు వచ్చేలోపు అందుబాటులో తీసుకు వచ్చేలా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. సమస్యలను స్వయంగా పరిశీలించి తక్షణం స్పందించి పరిష్కరించడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ దారం శంకర్, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమేష్‌ చౌహాన్, కౌన్సిలర్లు పర్యవేక్షించి పూర్తి చేయించారు.

Advertisement

Next Story

Most Viewed