మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్‌దే

by Naresh |
మెదక్ ఎంపీ స్థానం బీఆర్ఎస్‌దే
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మెదక్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రకటించడంతో పార్టీ గెలుపు ఖాయం అయిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మెర్గు మహేష్, ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. గతంలో సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వెంకట్రామిరెడ్డికి ప్రజల మద్దతు అన్నివేళలా ఉంటుందని తెలిపారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పేరును మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఇతర పార్టీలకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదన్నారు. పదవుల కోసం పాకులాడిన చరిత్ర బీజేపీ అభ్యర్థి ది అయితే ప్రగతి కోసం కష్టపడ్డ చరిత్ర వెంకట్రామిరెడ్డిదని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల కృషితో ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధిలో ముందు వరసలో నిలిచిందన్నారు. బీఆర్ఎస్ హాయంలో జరిగిన అభివృద్ధి, పూర్తైన ప్రాజెక్టులు బీఆర్ఎస్ పార్టీని మెదక్ పార్లమెంట్ స్థానంలో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అమలకు సాధ్యం కానీ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. సమావేశంలో నాయకులు ఎల్లారెడ్డి, యాదగిరి, రజనీకాంత్ రెడ్డి, శ్యామ్, శ్రావణ్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed