జోరుగా పీడీఎస్ బియ్యం అక్రమ దందా.. పట్టించుకోని సంబంధిత అధికారులు

by Anjali |
జోరుగా పీడీఎస్ బియ్యం అక్రమ దందా.. పట్టించుకోని సంబంధిత అధికారులు
X

దిశ, దౌల్తాబాద్ : ప్రభుత్వం పేదలకు ఆహారం కొరత లేకుండా ప్రతినెలా రేషన్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా అందిస్తున్నది. కానీ కొందరు డీలర్లు పీడీఎస్ బియ్యం అక్రమ దందాకు పాల్పడుతున్నారు. ప్రజలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టించి లాభాలు గడిస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం దందా కొందరు రాజకీయ నాయకుల కనుసైగల్లోనే నడిచేదనే చర్చ జరిగింది. కానీ ఇప్పుడు ఈ దందా అంతా రేషన్ డీలర్ల ఆధ్వర్యంలోనే సాగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ రేషన్ దందా అంతా దౌల్తాబాద్ మండలానికి సరిహద్దుల్లో ఉన్న గ్రామాల నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా రేషన్ బియ్యం జోరుగా తరలిస్తున్నారని అధికారులకు తెలిసినా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారంటే ఏదో మతలబు ఉందని పలువురు అనుకుంటున్నారు. ప్రస్తుతం దందా అంతా దౌల్తాబాద్ మండలం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని సంబంధిత అధికారులకు భారీమొత్తంలో ముడుపులు అందుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు .

దందా ఇలా..

ప్రభుత్వం ప్రజలకు అందించే రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారుల ద్వారా ప్రతినెలా పంపిణీ చేస్తారు. సివిల్ సప్లై అధికారులు ఆ రేషన్ షాపుల కార్డులను బట్టి ఏ షాపునకు ఎంత రేషన్ బియ్యం అందించాలో ఆ షాపులకు గోదాంలో కాంటా వేసి లారీల ద్వారా డీలర్లకు అందజేస్తారు. ఈ రేషన్ బియ్యాన్ని అక్కడున్న కార్డుదారులకు డీలర్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. రేషన్ బియ్యాన్ని కార్డు ఉన్న వాళ్లంతా రేషన్ బియ్యం తీసుకపోకపోవడం, అలాగే రేషన్ బియ్యం తినలేనివారు ఆ బియ్యాన్ని డీలర్లకే కేజీకి రూ.8 నుంచి రూ.12కు విక్రయిస్తారు. డీలర్లకు ప్రతినెలా ఎంత కోటా సరిపోతుందో ముందస్తుగానే గుర్తించడంతో ఆ మిగులు బియ్యాన్ని రేషన్ షాపులకు రాకుండానే డీలర్లు గోదాం వద్ద ఉన్న అధికారులను మెయింటైన్ చేసి అక్కడే నిల్వచేసి లారీల ద్వారా రాత్రివేళలో కర్ణాటక ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. కొందరైతే ఏకంగా ఊరికి వచ్చిన రేషన్ లారీ దగ్గర ప్రైవేట్ వాహనం పెట్టి దర్జాగా లోడ్ చేసి అక్రమార్కులకు రేషన్ తరలిస్తున్నారని సమాచారం.

అధికారుల హస్తం..!?

ఈ రేషన్ బియ్యం దందాలో అధికారుల హస్తం కూడా ఉన్నట్లు వినికిడి. ప్రతిరోజూ రాత్రివేళలో పెట్రోలింగ్ నిర్వహించే పోలీసులకు ఈ అక్రమ దందా బియ్యం లోడుతో వెళ్తున్న ఆటోలు, బొలెరో వాహనాలు కనిపించడం లేదా? అని స్థానిక ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దౌల్తాబాద్ సర్కిల్లోని పోలీస్ స్టేషన్‌కు గతం నుంచి రేషన్ బియ్యం దందా చేసే వ్యక్తులు ప్రతినెలా సుమారు రూ.లక్ష వరకు మామూలు ఇస్తున్నట్లు సమాచారం. అయితే దీని వెనుక పోలీస్ సిబ్బంది, రాజకీయ నాయకుల హస్తం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఊరి చివర, రోడ్డు పక్కన ఉన్న ఇళ్లే అడ్డాలు..

మండలంలో పీడీఎస్‌ బియ్యం దందా కొనసాగుతున్నది. అక్రమ రవాణాదారులు సిండికేటుగా ఏర్పడి, రేషన్‌ బియ్యాన్ని ద్విచక్రవాహనాలు, ఆటోలు, టాటాఏసీ వాహనాల్లో బియ్యం బస్తాలను తీసుకొచ్చి.. పాత రైస్‌మిల్లులు, రోడ్డు సౌకర్యం ఉండి ఊరు చివరన ఉన్న ఇళ్లలో అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని, డంప్‌ చేస్తారు. భారీ మొత్తంలో జమచేసిన తర్వాత రాత్రి సమయాల్లో లారీల్లో కర్ణాటక రాష్ట్రానికి, పక్కనే ఉన్న నారాయణపేట జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed