ఆ శవాన్ని తాకితే రూ.5 వేల జరిమానా విధిస్తాం

by Sridhar Babu |
ఆ శవాన్ని తాకితే రూ.5 వేల జరిమానా విధిస్తాం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : కుల బహిష్కరణ బతికి ఉన్నవారికే కాదు.. చని పోయిన శవాలకు కూడా వర్తింపజేసిన అమానవీయ సంఘటన సిద్దిపేట అక్బర్ పేట మండలం బొప్పాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... బండమీది సాయిలు అనే వ్యక్తికి 5 ఎకరాల భూమి ఉంది. అందులో మూడు గుంట భూమి విషయంలో నెల రోజుల క్రితం ఇరుగు పొరుగు వారితో గొడవ జరిగింది. విషయం కుల పెద్దల వరకు వెళ్లింది. ఆ భూమి విషయంలో కులస్తులతో గొడవ జరగడంతో సాయిలు కుటుంబాన్ని కుల బహిష్కరణ విధించారు.

అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన సాయిలు ఆగస్టు 20న మధ్యాహ్నం మృతి చెందాడు. కాగా ఆయన మృతదేహాన్ని చూడడానికి కూడా కులస్తులు రాలేదు. సాయిలు అంత్యక్రియల్లో ఎవరూ పాల్గొనవద్దని, పాల్గొన్న వారికి రూ.5 వేల జరిమానా వేస్తామని కులస్తులు తీర్మానం చేసినట్లు సమాచారం. దీంతో ఎవరూ అటు వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి కుటుంబ సభ్యులు మాత్రమే సాయిలు అంత్య క్రియల్లో పాల్గొన్నారు. కుల బహిష్కరణ పేరుతో వేధిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story