నీటిపారుదల శాఖ మంత్రికి.. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

by Naresh |
నీటిపారుదల శాఖ మంత్రికి.. మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట జిల్లా రైతంగా ప్రయోజనాల దృష్ట్యా మీకు ఈ లేఖ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ వ్రాసారు. ఈ సందర్భంగా ఆరుగాలం శ్రమించి వరి పంట సాగు చేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రైతుల పక్షాన కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచడం జరిగిందని, కానీ నేడు మీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు.

ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్ళముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారన్నారు. వ్యవసాయ బావులకు సంబంధించి పూడికతీత పనుల్లో రైతులు నిమగ్న అయ్యారన్నారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలన్నారు. గత నాలుగేళ్ల పాటు ఈ సమయంలో రంగనాయక సాగర్ నిండుకుండలా నీటితో కళకళలాడిందన్నారు.

కానీ ప్రస్తుతం నీళ్లు లేక రిజర్వాయర్ బోసిపోయి కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్‌లో కూడా 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని లేఖలో కోరారు. క్షేత్ర స్థాయిలో మీరు పరిశీలించి వాస్తవాలను గ్రహించాల్సిందిగా లేఖలో కోరారు. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాల పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని..రైతులకు అండగా ఉంటానని లేఖలో హరీష్ రావు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed