జోగిపేటలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

by Mahesh |
జోగిపేటలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
X

దిశ, ఆందోల్: జోగిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి బస్టాండ్ ముందున్న డివైడర్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. నాగోల్ కు చెందిన అభిలాష్ (30) జోగిపేట లోని తన అత్తగారింటికి భార్య సింధూ, కుమారుడితో కలిసి రాఖీ కట్టేందుకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి జోగుపేటలోని బస్టాండ్ ముందున్న డివైడర్ స్తంభానికి కారు బలంగా ఢీకొట్టింది. కారు బెలూన్స్ ఓపెన్ అవడంతో కారులో ఉన్న అభిలాష్, ఆయన భార్య సింధు, కుమారుడు క్షేమంగా బయటకు రావడంతో ప్రమాదం తప్పిందని అందరూ భావించారు.

స్థానిక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అభిలాష్‌కు ప్రథమ చికిత్స చేసి, హైదరాబాదుకు తరలిస్తుండగా మార్గ మధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. రెండు, మూడు నిమిషాల వ్యవధిలో క్షేమంగా అత్తగారింటికి చేరుకునే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం బాధాకరం. మృతి విషయాన్ని తెలుసుకున్న అత్తవారింటి బంధువులు, స్నేహితులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే అభిలాష్ మృతి చెందడం పట్ల పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed