ఫార్మాసిటీ మా కొద్దు.. కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా..

by Sumithra |
ఫార్మాసిటీ మా కొద్దు.. కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా..
X

దిశ, సంగారెడ్డి : కాలుష్యాన్ని కలిగించే ఫార్మాసిటీ మాకొద్దు అంటూ న్యాల్ కల్ మండలం డప్పూరు, మాల్టీ, వడ్డీ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు ధర్నా, ముట్టడి చేశారు. సోమవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని కలెక్టరేట్ ముందు ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించారు. వాతావరణాన్ని, నీటిని కాలుష్యం చేసే కంపెనీ మాకు వద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డప్పురులో ఏర్పాటు చేసే ఫార్మసిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రైతుల ధర్నాకు సీపీఎం మద్దతు ప్రకటించింది. అదే విధంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం డప్పూరు, మాల్గీ, వడ్డీ గ్రామాల్లో ఏర్పాటు చేసే ప్రమాదకరమైన ఫార్మాసిటీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

మూడు పంటలు పండే పచ్చని ప్రాంతంలో వ్యవసాయాన్ని నాశనం చేసే ఫార్మాసిటీని ఇక్కడ పెట్టొద్దన్నారు. ఫార్మాసిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయం పైనే ఈ గ్రామాల ప్రజల జీవనాధారం ఉన్నదని, ఫార్మాసిటీ వలన ఇక్కడ వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుందన్నారు. పక్కనే ఉన్న మంజీరా నది కలుషితమై సంగారెడ్డి జిల్లాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కూడా పూర్తిగా కలుషితమవుతుందని అన్నారు. త్రాగు నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని, ప్రజలకు నష్టం చేసే ఫార్మసిటిని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టంలో పంటలు పండే చోట పరిశ్రమలు పెట్టొద్దని ఉన్నప్పటికీ అధికారులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఫార్మసిటీ రద్దు చేసే వరకు రైతుల పక్షాన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మాణిక్యం, గ్రామ రైతు నాయకులు రవీందర్, శివరాజ్, శ్రీకాంత్ మూడు గ్రామాల రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed