రైతులకు చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లించాలి: జిల్లా కలెక్టర్ శరత్

by Shiva |
రైతులకు చెల్లించాల్సిన ప్రతి పైసా చెల్లించాలి: జిల్లా కలెక్టర్ శరత్
X

దిశ, సంగారెడ్డి: జహీరాబాద్ ట్రైడెంట్ చక్కర కర్మాగార యాజమాన్యం రైతులకు చెల్లించాల్సిన ప్రతి పైసా వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ శరత్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ ఛాంబర్ లో చెరుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలు, కార్మికుల సమస్యలు తదితర అంశాలపై జిల్లా ఎస్పీ రమణ కుమార్ తో కలిసి కంపెనీ యాజమాన్యం, చెక్కర, కార్మిక శాఖల అధికారులు, కార్మిక సంఘం ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెరుకు రైతులను ఏలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, రైతులకు ఏలాంటి నష్టం జరగకూడదన్నారు.

చెక్కర అమ్మిన వెంటనే వచ్చిన డబ్బును రైతులకు చెల్లించాలని కంపెనీ యాజమాన్యాన్ని ఆదేశించారు. కంపెనీకి రైతులు ఇచ్చిన చెరకు ఎంత, ఇప్పటి వరకు చెక్కర ఉత్పత్తి ఎంత, స్టాక్ ఎంత ఉంది, రైతులకు చెల్లించాల్సినది ఎంత ఆయా వివరాలు మొత్తం అందుబాటులో ఉండాలని కంపెనీ అధికారులకు ఆయన సూచించారు. అదేవిధంగా స్టాక్ వెరిఫికేషన్ జరగాలని, ఫిజికల్ గా చెక్కర బ్యాగులను పరిశీలించాలని సూచించారు. స్టాక్ డైవర్ట్ కాకుండా చూడాలని, పూర్తిస్థాయిలో పర్యవేక్షించి రైతులకు చెల్లించాల్సిన బకాయలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు చక్కెర అమ్మకుండా అడ్డుపడకూడదని, కార్మికులకు ఏ సమస్యలు ఉన్నా లేబర్ శాఖ డిప్యూటీ కమిషనర్ కు తెలియజేయాలన్నారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కార్మిక సంఘం ప్రతినిధులకు సూచించారు. ఫ్యాక్టరీ ఉద్యోగుల ఫీఎఫ్ కు సంబంధించి చట్టబద్ధ రక్షణ ఉందని తెలిపారు. మరణించిన ముగ్గురు కార్మికులకు సంబంధించిన ఎక్సగ్రేషియా వెంటనే చెల్లించాలని, కార్మికుల ఇన్సూరెన్స్ కు సంబంధించిన ప్రీమియం చెల్లింపులు సకాలంలో కట్టాలని కంపెనీ యాజమాన్యానికి సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ముందు చెల్లింపులు జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, చక్కెర శాఖ సహాయ కమిషనర్ రాజశేఖర్, డీఎస్పీ, సీఐ, కార్మిక సంఘం ప్రతినిధులు రాములు, రత్నం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story