ఓటరు జాబితా 2024-25 స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి

by Kalyani |
ఓటరు జాబితా 2024-25 స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలి
X

దిశ, సంగారెడ్డి : జిల్లాలో ఓటర్ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పనపై జిల్లాల కలెక్టర్ లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు వస్తున్న దరఖాస్తుల విచారణ మిషన్ మోడ్ లో పూర్తి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నవంబర్ 6 లోపు నమోదు చేయాలని, .ఓటర్ జాబితా సవరణ 2024-25 కోసం స్వీప్ కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని, దీని కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించాలని సూచించారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలన్నారు.

యువ ఓటర్ల నమోదుతో పాటు దివ్యాంగులు, థర్డ్ జెండర్, సెక్స్ వర్కర్ మొదలగు వర్గాలు, ఆదివాసీ, గిరిజనుల ఓటర్ల నమోదు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఓటర్ జాబితా రూపకల్పన పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, ఏ ఒక్కరిని వదలకుండా ఓటు హక్కు కల్పించాలన్నారు. అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను నవంబర్ 29 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ జాబితా ప్రచురించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు కలెక్టర్ మాధురి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ అంథోని, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed