కేసీఆర్‌ను రెండు సార్లు గెలిపించిన పాపానికి.. 32 వేల కుటుంబాలు వీధిన పడ్డాయి: ఈటెల రాజేందర్

by Mahesh |   ( Updated:2023-11-04 15:11:56.0  )
కేసీఆర్‌ను రెండు సార్లు గెలిపించిన పాపానికి.. 32 వేల కుటుంబాలు వీధిన పడ్డాయి: ఈటెల రాజేందర్
X

దిశ, మనోహరాబాద్, తూప్రాన్: గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో జరగకపోయినా కేసీఆర్ ను రెండు సార్లు ఓట్లు వేసి గెలిపించిన పాపానికి 32వేల రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఫలితంగా వారంతా అడ్డా కూలీలుగా మారారని గజ్వేల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మండలంలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, జీడిపల్లి, గొల్ల గడ్డ, స్టేషన్ మనోహరాబాద్, మనోహరాబాద్, రామాయపల్లి గ్రామాలలో పాటు తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. వందలాదిమంది కార్యకర్తల బైక్ ర్యాలీ మధ్య ఈటల రాజేందర్ ప్రధాన వీధుల గుండా రోడ్ షో నిర్వహించారు.

మొదట ఆయన నివాసం నుండి కాళ్లకల్‌కు చేరుకోగా స్థానిక సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, మండల పార్టీ అధ్యక్షుడు నరేంద్ర చారిల ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. మేల వాయిద్యాలతో స్థానిక బంగారమ్మ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోకి రోడ్ షో ద్వారా వెళ్లగా గ్రామం నడిబొడ్డున ఎంపీటీసీ నత్తి లావణ్య ఆధ్వర్యంలో వందలాది మంది మహిళలు ఈటెల రాజేందర్‌కు తిలకం దిద్ది మంగళహారతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ 2014లో ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని నమ్మించడంతో గజ్వేల్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు.

రెండోసారి 2018 లో కేసీఆర్ ను గెలిపించగా 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామంలో పర్యటించని కేసీఆర్ ముఖం చాటేసి చివరకు రైతుల భూములను గుంజుకొని వారి జీవితాలతో ఆటలాడారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తును ఆగమాగం చేశారని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులుగా తీర్చిదిద్దారని, నిరుపేదలకు సరైన వైద్య మందక చస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని ఎదిరించడానికి, దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దె దించడానికి, అబద్దాలకోరు సీఎం కేసీఆర్ పై పోటీ చేసి గెలుపొందడానికి మీ ఆశీర్వాదం కోసం వచ్చానని ఈటల రాజేందర్ ప్రజలను వేడుకున్నారు.

ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించి గెలిపించండి. ఎల్లవేళలా మీ వెన్నంటే ఉండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ ఇంటి ముందుకే తీసుకొచ్చి ఇస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. జీడిపల్లి గ్రామంలో ఎన్నికల పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈటెల సమక్షంలో పలు గ్రామాల నుంచి వందలాది మంది బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి నాయకులు వర్గంటి రామ్మోహన్ గౌడ్, అజయ్ కుమార్, కిరణ్ కుమార్ యాదవ్, కృష్ణ , నాగరాజు, కృష్ణ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story