పల్లెలో విద్య విప్లవం రావాలి : జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్

by Shiva |   ( Updated:2023-04-29 10:18:16.0  )
పల్లెలో విద్య విప్లవం రావాలి : జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్
X

దిశ, దౌల్తాబాద్: అణగారిన వర్గాల పిల్లలకు అక్షరమే ఆయుధం కావాలని, అంబేద్కర్ కలలు కన్నా సమసమాజ స్థాపన విద్య విప్లవంతోనే సాధ్యమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రజాగాయకులు సాయిచంద్, జాతీయ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్నారు. శుక్రవారం రాత్రి దౌల్తాబాద్ మండలం ఇంద్రుప్రియాల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని వారు కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ చరిత్ర చెప్పితే ఒడిచేది కాదని, తన జీవితమంతా అణగారిన వర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప మహానీయులని అన్నారు. అవమానాలకు, అసమానతలకు గురై బడి బయట అక్షరాలను నేర్చుకుని భారతదేశ రాజ్యాంగం రాసిన గొప్ప మేధావి అంబేద్కర్ అన్నారు. సబ్బండ కులాలు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువాలని, ముఖ్యంగా యువత అంబేద్కర్ ను చదివి తన ఆశయ సాధన‌ కోసం పోరాటం చేయాలన్నారు. అంబేద్కర్ ను అధిపత్య కులాలు కొందరి వాడిగా చేశారని.. అంబేద్కర్ అందరివాడు అన్నారు.

వెలివాడలో వెలిసిన సూర్యుడు అంబేద్కర్ అని, అంబేద్కర్ విగ్రహాలను గ్రామ నడిఒడ్డున పెట్టాలని సూచించారు. మతం, కులం పేరిట అవమానం చేస్తే చూస్తూ ఊరుకోవద్దని యువతకు సూచించారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి కుట్రలను తిప్పికొట్టెందుకు సబ్బండ కులాలు సంసిద్ధంగా ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టడం హర్షనీయమన్నారు. అలాగే రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ నామకరణం చేశారని చెప్పారు.

కన్నీరు పెట్టిన సాయిచంద్

సభలో అంబేద్కర్ చరిత్ర, పిల్లల త్యాగాల గురించి సాయిచంద్ చెప్పుతూ కన్నీరు పెట్టారు. అంబేద్కర్ తమ కుటుంబానికి దూరంగా ఉండి అణగారిన వర్గాల జాతి అభివృద్ధి కోసం తమ నలుగురి పిల్లలను కూడా బతికించుకోలేని నిస్వార్థ పరుడని, అంబేద్కర్ ఒక శక్తి అన్నారు. ఆయన అందించిన ఓటు అనే వజ్రాయుధంతో అధిపత్య కులాలకు బుద్ది చెప్పాలని కోరారు. దళిత బహుజనలో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో కులవృత్తులు నమ్ముకొని బానిసలుగా బతుకుతున్నారని, చెప్పులు కుట్టి, డబ్బులు కొట్టిన చేతులతోనే చరిత్రను రాయాలని, పాటలు పాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన కళాకారులు సైతం దళిత బహుజనలే అని, సమాజాన్ని చైతన్యం చేయడంలో ముందున్న దళితులు,బహుజనులు ఇకమీదట చట్టసభలకు వెళ్లి రాజ్యాన్ని పాలించడం, చట్టాలు చేయడం కూడా వచ్చని నిరూపిస్తామన్నారు. తన పాడిన పాటలు ఆలోచింపజేశాయి. పాడిన పాటలను జనం చప్పట్ల వర్షం కురిపించారు.

పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి

దేశ రాజధాని డిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి డా.బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్నారు. మనువాదానికి మన వాదానికి యుద్ధం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని, అలాగే ప్రపంచంలో ఏక్కడ లేని విధంగా హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు.

అంబేద్కర్ స్పూర్తితో ముందుకు పోవాలని కోరారు.రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర జరుగుతుందని, రాజ్యాంగాన్ని మారిస్తే అంబేద్కర్ వారసుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. దేశ సంపద, భూమి కొద్ది మంది ఆధిపత్య కులాల చేతిలోనే ఉందని కులమత బేధాలు లేకుండా పేద బడుగు బలహీన వర్గాల దళిత బహుజనులకు భూమిని జాతీయం చేయాలన్నారు. ఈ దేశ మూలవాసులు, జంబుద్వీప రాజులు, ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన మూలవాసులు, ద్రావిడులు మళ్లీ తిరిగి భారతదేశాన్ని పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయని, అది సాధ్యం కావాలంటే నూటికి 85 శాతం ఉన్న దళిత బహుజనులందరూ ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాలన్నారు.

అనంతరం డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు బీమసేన మాట్లాడుతూ ఇంద్రు ప్రియాల్ గ్రామం ఉద్యమాల గడ్డ అని, నాటి నక్సలైట్ ఉద్యమాలే ఈ ప్రాంతాన్ని చైతన్యం చేశాయని వారి పోరాట ఫలితమే నేటి స్వేచ్ఛాయుత వాతావరణమని ఇందు ప్రియాల్ గ్రామానికి ప్రత్యేక చరిత్ర ఉందని వివరించారు. నీల్ లాల్ జెండాల సిద్ధాంతమే మన మనుగడకు మార్గదర్శకం అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్య, సర్పంచ్ శ్యామల కుమార్, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపీటీసీ వీరమ మల్లేశం,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కోఆర్డినేటర్ ర్యాకం శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఉద్దండపురం సత్యనారాయణ, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుమ్మ శ్రీనివాస్, మెదక్ జిల్లా అధ్యక్షులు సామల అశోక్,డీబీఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండ స్వామి,తెలంగాణ మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి,

సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రాజయ్య, గబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేణు, బీఆర్ఎస్ నాయకులు ఇప్ప దయాకర్, దళిత బహుజన సంఘాల నాయకులు లాలు, కృపాకర్,చందా రాజు, అరుణ్, యాదగిరి, రాజేందర్, చంద్రం, మండల అధ్యక్షులు కిషన్, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు స్వామి, జిల్లా అధికార ప్రతినిధి రామచంద్రం, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు యాదగిరి, నర్సింలు,పరశురాములు, రమేష్, రాంచంద్రం, యాదగిరి, సీనియర్ జర్నలిస్టులు బండారు రాజు, పుట్ట రాజు, సురేందర్, సాయిలు, గణేష్, యాదగిరి, భాస్కర్ విద్యార్థులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story