మా జోలికి రాకండి.. మీకే మంచిది: ఏపీ మంత్రిపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌

by Shiva |   ( Updated:2023-04-12 14:51:55.0  )
మా జోలికి రాకండి.. మీకే మంచిది: ఏపీ మంత్రిపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌
X

దిశ, అందోల్: అనవసర మాటలు మాట్లాడి మా జోలికి రావొద్దని, అది మీకే మంచిదంటూ.. మంత్రి హరీష్‌రావు ఏపీ మంత్రిపై ఫైర్‌ అయ్యారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో అర్థమవుతోందన్నారు.

రాష్ట్రంలో 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని, బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉందని, బాలింతలకు కేసీఆర్‌ కిట్‌ ఉందని, ఆడపిల్లల పెళ్లిళ్లకు అండగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలున్నాయని, ఏడాదికి ఎకరానికి రూ.10 వేలను అందించే రైతుబంధు పథకం ఉందన్నారు. కుటుంబంలో రైతు చనిపోతే రూ.5 లక్షలను అందించే రైతు బీమా పథకం ఉందని చెప్పుకొచ్చారు.

ఇలా చెప్పుకుంటే పోతే మీ నోర్లు మూతపడతాయన్నారు. ఏపీ ప్రత్యేక హోదా అంశంపై స్పందించని కేంద్ర ప్రభుత్వాన్ని అధికార పార్టీ అడగదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించదంటూ వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ పార్టీలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. ఈ రెండు పార్టీలు జనాలను గాలికి వదిలేసి వారి స్వార్థ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని ఆయన నిప్పులు చెరిగారు.

కేంద్రం ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడడం లేదన్నారు. విశాఖ ఉక్కును తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితి ఆ రెండు పార్టీలకు దాపురించిందని అన్నారు. అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదంటూ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్‌ పర్సన్‌ మంజుశ్రీ జైపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు జెపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, జగన్మోహన్‌రెడ్డి, శివశేఖర్, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Also Read.. దేశంలో అత్యధిక కేసులు కలిగిన సీఎం కేసీఆరే!


Advertisement

Next Story

Most Viewed