ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

by Kalyani |
ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
X

దిశ, సంగారెడ్డి : ధరణి సమస్యలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, రోజుకు వెయ్యి పెండింగ్ ధరఖాస్తులు పరిష్కరించాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుండి వివిధ జిల్లాల కలెక్టర్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను ఎన్ని పరిష్కరించారని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు వెయ్యికి తగ్గకుండా పెండింగ్ లోఉన్న ధరణి దరఖాస్తులను పరిష్కారించాలని, ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. సక్సెషన్, పెండింగ్, మ్యుటేషన్ వంటి దరఖాస్తుల రికార్డులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, అదనపు కలెక్టర్, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా ప్రణాళికా బద్ధంగా, ప్రతిరోజూ పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసి పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న పెండింగ్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, డీఆర్ఓ పద్మజా రాణి, కలెక్టరేట్ అడ్మినిస్ట్రషన్ అధికారి పరమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed