జనసంద్రంగా ఏడుపాయలు

by Sridhar Babu |
జనసంద్రంగా ఏడుపాయలు
X

దిశ, కొల్చారం : మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడు రోజులపాటు జరిగే ఏడుపాయల వన దుర్గ భవాని జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయలలో పుణ్య స్థానాలు చేసిన భక్తులు ఉపవాస దీక్షను చేసి సాయంత్రం తిరిగి స్నానాలు చేసి వనదుర్గమాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మన దుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు భక్తుల స్థానాల కోసం ఆలయ సమీపంలో షవర్లను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఏడుపాయలలో ప్రధాన ఆలయంతో పాటు రాజగోపురం వరకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఏడుపాయల ఆలయం వెనుక భాగం లోని గుట్ట సైతం ఎల్ఈడీ దీపాల వెలుగులతో కనువిందు చేసింది. రాజగోపురం సమీపంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణం యాత్రికులను ఆకట్టుకుంది.

వనదుర్గా మాతను దర్శించుకున్న మహిళా కమిషన్ చైర్మన్

ఏడుపాయల వన దుర్గామాతను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బాలా గౌడ్ సునీత లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్చారం జెడ్పీటీసీ సభ్యురాలు మేఘమాల సంతోష్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ఈవో శ్రీనివాస్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు యాద గౌడ్, బాగా రెడ్డి, మాజీ సభ్యులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story