నాన్నకు ప్రేమతో..

by Mahesh |   ( Updated:2023-07-12 02:35:08.0  )
నాన్నకు ప్రేమతో..
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి కొంత అలసిపోతున్న తండ్రులకు.. ‘నాన్న మేమున్నాం’ అంటూ కూతుళ్లు అండగా నిలబడుతున్నారు. పార్టీ పనుల బిజీలో తండ్రులు హైదరాబాద్‌లో ఉంటే బిడ్డలు జనంలోకి వెళుతున్నారు. ‘మా నాన్న.. మీకు అండగా ఉంటారని’ పేదలకు ఆడబిడ్డలు భరోసా ఇస్తున్నారు. నాన్నల కోసం జనంలోకి వెళ్లి పేదల సాధక బాధలు తెలుసుకుంటున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. అదే స్థాయిలో ప్రజల నుంచి కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. తండ్రులు ఉన్నప్పుడు వారితో కలిసి, అందుబాటులో లేనప్పుడు వారే స్వయంగా గ్రామాలు పర్యటిస్తూ శభాష్​ అనిపించుకుంటున్నారు. అందోల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష, సంగారెడ్డిలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎనాన్నకు ప్రేమతో.. మ్మెల్యే జగ్గారెడ్డి బిడ్డ విజయలక్ష్మి, గజ్వేల్ సెగ్మెంట్ లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురు ఆంక్ష రెడ్డి గత కొంత కాలంగా జనంలో పర్యటించడం పై ఆసక్తికర చర్చ జరుగుతున్నది. చిన్న వయసులోనే నాన్నల కోసం పెద్ద బాధ్యతలు తీసుకున్న ఆడబిడ్డలను చూసి జనం మెచ్చుకుంటున్నారు.

జగ్గారెడ్డిని గెలిపించిన కూతురు విజయలక్ష్మి..

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)కి రాజకీయంగా అతని కుటుంబమే అండగా నిలబడింది. ప్రధానంగా కూతురు విజయలక్ష్మి నాన్నను మించిన కూతురు అనిపించుకున్నది. 2018లో జరిగిన ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో జగ్గారెడ్డి ప్రచారం కూడా చేసుకోలేదు. ప్రచార బాధ్యతలు పూర్తిగా కూతురు విజయలక్ష్మి చూసుకున్నది. రోజు ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాలను చుట్టేసి తన తండ్రి జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీపై అద్భుతమైన స్పీచ్ లు ఇచ్చింది. ‘అక్రమ కేసులు పెట్టించి మీ లీడర్ జగ్గారెడ్డిని జైళ్లలో పెట్టిస్తున్నారని’ కంటతడి పెట్టింది.

విజయలక్ష్మి స్పీచ్ అన్ని వర్గాల ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీ రెండోసారి పోటీలో నిలబడిన సందర్భం అధికార పార్టీ ప్రచారాలను తలదన్నే విధంగా ఆమె జనాల్లోకి వెళ్లింది. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో జగ్గారెడ్డి విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభంజనంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​రావు సొంత జిల్లాలో జగ్గారెడ్డి గెలుపు గొప్పగానే చెప్పుకోవచ్చు. ‘నన్ను నా బిడ్డనే గెలిపించిందని’ జగ్గారెడ్డి ఎంతో మురిసిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విజయలక్ష్మి అవసరమైనప్పుడు జనంలోకి వస్తూనే ఉన్నారు.

యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అంక్షారెడ్డి..

గజ్వేల్ నియోజకవర్గంలో యువనాయకురాలు అంక్షారెడ్డి పేరు ఇప్పుడు ఫేమస్ అయ్యింది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయంలో దిగారు. నియోజకవర్గంలో తన తండ్రికి అండగా రాజకీయంలో అడుగుపెట్టిన ఆమె పనితీరును గుర్తించిన పార్టీ అధిష్టానం సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఇచ్చింది. పార్టీ కోసం ఆమె విస్త్రతంగా పర్యటిస్తున్నారు. జనంలోకి వెళ్లి ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగిన ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు.

పార్టీ యువనేత రాహుల్ మొదలుకుని ఏఐసీసీ పెద్దలు, రాష్ట్రంలో రేవంత్​రెడ్డి, ఉత్తమ్ కుమార్ లాంటి వారు పలు సందర్భాల్లో అభినందించారు. నర్సారెడ్డి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడుతుంటారు. వెన్నునొప్పి ఆయనను వేధిస్తుంటుంది. నాన్న ఇబ్బంది పడుతున్నది గుర్తించి కూతురు అక్షా రెడ్డి రంగంలోకి దిగుతారు. పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు మొత్తం ఆమెను సమర్థవంతంగా పూర్తి చేయించింది. యువతీ యువకులను వెంటబెట్టుకుని ప్రతి పల్లెను చుట్టేస్తున్నారు. చిన్న వయసులోనే రాజకీయ పార్టీలో కండువాలు వేసుకుని ఆమె గ్రామాల్లో తిరుగుతుంటే అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.

రంగంలోకి రాజనరసింహ కూతురు త్రిష..

అందోల్ నియోజకవర్గంలో సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ కూతురు త్రిష రాజకీయంలో అడుగుపెట్టారు. రాజకీయ వ్యూహంలో భాగంగా తండ్రి హైదరాబాద్‌లో ఉంటుంటే త్రిష గ్రామాలు చుట్టేస్తుంది. కొద్ది రోజులుగా ఆమె విరామం లేకుండా గ్రామాలు తిరుగుతూ అందరిని పలకరిస్తున్నారు. నాన్న మీకు అండగా ఉంటాడు. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాలకు వెళ్తున్న త్రిషకు పార్టీ శ్రేణుల నుంచి ఘనమైన స్వాగతం లభిస్తున్నది. తండ్రి అందుబాటులో ఉంటే ఆయనతో కలిసి గ్రామాలకు వెలుతున్న త్రిష ఆయన లేనప్పుడు ఒంటరిగానే పల్లెల్లోకి వెళుతున్నారు. ‘అమ్మా..ఎలా ఉన్నారు.? ఏం బాధలు ఉన్నాయి.? కొద్ది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ బాధలు తీరుతాయని చెబుతున్నారు.’ జనం లోకి వెళ్ళగానే వృద్ధులు, మహిళలు బిడ్డ అంటూ దగ్గరకు తీసుకుని అభినందిస్తున్నారు. ప్రజల నుంచి అధ్బుతమైన స్పందన వస్తుండడంతో ఆమె ఉత్సాహంగా జనంలోకి వెళుతున్నారు..

అవకాశం వస్తే పోటీలో దింపడానికే..

రాజకీయంగా దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి, తూంకుంట నర్సారెడ్డి ముగ్గురూ సీనియర్ లీడర్లే. పార్టీలో రాజనరసింహ, జగ్గారెడ్డి హవా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పార్టీలో తమ హవా కొనసాగితే అవసరమైతే బిడ్డలను పోటీలో దింపడానికే ఈ ముగ్గురు నాయకులు కూతుళ్లను జనంలోకి పంపించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా మహిళలకు మంచి ప్రాధాన్యత లభిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే బిడ్డలను రాజకీయంలోకి తీసుకువచ్చినట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. త్రిష, విజయలక్ష్మి, అంక్షారెడ్డి ముగ్గురూ విద్యావంతులే కావడం, పార్టీలు, ప్రభుత్వాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండడంతో జనంలోకి వెళ్లిన సందర్భంలో అనర్గళంగా మాట్లాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పటివరకైతే ముగ్గురికి మంచి గుర్తింపు రాగా మున్ముందు ఇంకా ఎలాంటి పదవులు వారిని వరించనున్నాయో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story