వెటర్నరీ కళాశాలను తిరిగి ఇచ్చాకే సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలి

by Disha Web Desk 15 |
వెటర్నరీ కళాశాలను తిరిగి ఇచ్చాకే సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు అడగాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పందించారు. సగం పనులు పూర్తయిన సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్ కు తరలించకపోయిన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటకు తిరిగి వెటర్నరీ కళాశాలను మంజూరు చేసిన తర్వాతే ఓట్లు అడగాలని హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో నిర్వహించిన ఆటో కార్మికుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.... ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రామిసరీ నోట్లతో ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ నేడు గాడ్ ప్రామిస్ ల పేరిట ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నారు. ఎంపీ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అబద్దాలకు ఆమోదం తెలిపినట్లు అవుతుందన్నారు.

బాండ్ పేపర్ బౌన్స్ అయినందున కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శిక్ష విధించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారులను బలి చేయొద్దని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కోతలు తిరిగి ప్రారంభం అయ్యాయి అన్నారు. కరెంటు పోతే బదిలీ వేటు వేస్తారని భయంతో కరెంట్ అధికారులు బీఆర్ఎస్ మీటింగ్ ను జనరేటర్లతో నడిపించే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాల రాసిందన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో అంబానీలకు తప్ప పేద ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేక ఒకరు గాడ్ ప్రామిస్ లతో... మరొకరు క్యాలెండర్లు పంచుతూ ఓట్లు అడుగుతున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీలకు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, నాయకులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Next Story