కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్‌ కుమార్‌‌పై కేసు

by Hajipasha |
కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్‌ కుమార్‌‌పై కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్‌ దాడిచేసిన ఘటనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత గురువారం ఉదయాన్నే బిభవ్‌ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) సమన్లు ఇచ్చింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్‌సీడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది.ఈ నోటీసులను సీఎం కేజ్రీవాల్‌ కార్యాలయానికి జాతీయ మహిళా కమిషన్‌ పంపించడం గమనార్హం. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలో ఆయన మాజీ పీఎస్ బిభవ్‌ కుమార్‌ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతి మలివాల్ సోషల్‌ మీడియా వేదికగా చేసిన పోస్ట్‌‌ను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా తీసుకుంది. ఈ పరిణామం చోటుచేసుకున్న కొన్ని గంటల తర్వాత ఇద్దరు పోలీసు అధికారులతో కూడిన టీమ్ స్వాతి మలివాల్ నివాసానికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసింది. దాదాపు నాలుగు గంటలపాటు ఈ ప్రక్రియ జరిగింది. అనంతరం పోలీసులు బిభవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బీజేపీ వాళ్లూ రాజకీయం చేయకండి : స్వాతి

ఈ అంశంపై స్వాతి మలివాల్ గురువారం సాయంత్రం తొలిసారిగా స్పందించారు. ట్విట్టర్ (ఎక్స్)లో ఓ పోస్ట్ చేసిన ఆమె.. ‘‘నాతో చాలా ఘోరం జరిగింది. దానిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నాకు చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో నా కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు. నా క్యారెక్టర్‌కు మచ్చ తెచ్చేందుకు యత్నించిన వారికి, మరో పార్టీ సూచనల మేరకే నేను ఇదంతా చేస్తున్నానని ప్రచారం చేసిన వారిని కూడా దేవుడు సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నాను. దేశంలో ముఖ్యమైన ఎన్నికలు జరుగుతున్నాయి. స్వాతి మలివాల్ ముఖ్యం కాదు. దేశ సమస్యలు ముఖ్యమైనవి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘బీజేపీ వారికి నా ప్రత్యేక అభ్యర్థన ఏమిటంటే ఈ సంఘటనను రాజకీయం చేయొద్దు’’ అని స్వాతి మలివాల్ కోరారు.

కేజ్రీవాల్‌‌ మౌనం.. సంజయ్ సింగ్ సమాధానం

ఇక స్వాతి మలివాల్‌‌ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు ప్రశ్న ఎదురైంది. దానిపై సీఎం మౌనం వహించగా..ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ మైక్‌ తీసుకొని మీడియాకు ఎదురుప్రశ్నలు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో విపక్ష ‘ఇండియా’ కూటమి భాగస్వామి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ మాట్లాడుతూ.. మణి‌పూర్ ఘటనలను గుర్తు చేశారు.‘‘మణి‌పూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు. లైంగిక దౌర్జన్యం కేసులో జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరి వాటి సంగతి ఏంటి..? దేశ రాజధానిలో జంతర్‌మంతర్‌ వద్ద మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో అప్పుడు ఢిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్న స్వాతి మలివాల్ మద్దతు ప్రకటించారు. అప్పుడు ఆమెను పోలీసులు ఈడ్చేశారు.. కొట్టారు. వీటన్నింటిపై కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ మౌనంగా ఉంది’’ అని ఘాటుగా బదులిచ్చారు. దీనికంటే ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయంటూ మీడియా ప్రశ్నకు అఖిలేశ్ స్పందించారు.

Advertisement

Next Story