అక్రమ నిర్మాణాలు చేపడితే పెద్ద ఎత్తున పెనాల్టీ : జిల్లా కలెక్టర్

by Aamani |
అక్రమ నిర్మాణాలు చేపడితే  పెద్ద ఎత్తున పెనాల్టీ :  జిల్లా కలెక్టర్
X

దిశ,నర్సాపూర్ : అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే పెద్ద ఎత్తున పెనాల్టీ వేస్తామని, లేని పక్షంలో వారు నిర్మించుకున్న ఇల్లు అమ్మాల్సిందేనని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన నర్సాపూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఆర్డీవో కార్యాలయంలో ధరణి పెండింగ్ సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారం తో పాటు మురికి కాలువను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణికులతో ఉచిత బస్సు పై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం లేదని ఇల్లు నిర్మించుకోవడానికి అంతా ఆన్లైన్ సిస్టం ఉన్నది కనుక సరైన పత్రాలు ఉంటే ప్రతి ఒక్కరికి అనుమతులు ఇస్తామని తెలిపారు.

జిల్లాలో గత వారం రోజుల నుంచి ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఇప్పటివరకు 5000 దరఖాస్తులను పరిష్కరించామని, మరో 6000 వరకు పెండింగ్లో ఉన్నాయని 15 రోజుల్లో వాటిని సైతం పరిష్కరిస్తామని తెలిపారు. బస్టాండ్ పక్కన ఉన్న మురికి కాల్వ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు వల్ల ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరుతుందని గతంలో కంటే ప్రస్తుతం బస్సులలో రద్దీ చాలా తగ్గిందని తెలిపారు. అయితే ప్రజలు ప్రతి పనికి కలెక్టరేట్ కార్యాలయానికి వస్తున్నారని వ్యయ ప్రయాసల కొర్చి అంత దూరం రాకుండా ఆర్డీవో కార్యాలయం తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లోనే సమస్యలను దరఖాస్తు చేసుకుంటే అక్కడే పరిష్కారం అవుతాయని తెలిపారు. అనంతరం మండల పరిధిలోని పెద్ద చింతకుంట ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. పక్కనే ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, తహసిల్దార్ కమలాద్రి, మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్ నాయక్ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed