అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా 'ఆరోగ్య మహిళ' షురూ : మంత్రి హరీష్​రావు

by Sridhar Babu |
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుకగా ఆరోగ్య మహిళ షురూ : మంత్రి హరీష్​రావు
X

దిశ , సంగారెడ్డి : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం 'ఆరోగ్య మహిళ' కార్యక్రమం అమలుకు శ్రీకారం చుడుతోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. ప్రయోగాత్మకంగా తొలుత వంద కేంద్రాల్లో ఈనెల 8 వ తేదీన ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. శనివారం సాయంత్రం పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారిలతో కలిసి మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళా వైద్యాధికారులు, మహిళా వైద్యారోగ్య శాఖ సిబ్బంది సేవలు అందుబాటులో ఉన్న పీ హెచ్ సీలు, బస్తీ దవాఖానాలను తొలివిడతలో ఎంపిక చేశామని, క్రమక్రమంగా అన్ని ప్రాంతాలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని అన్నారు.

ప్రభుత్వం కొత్తగా అమలుచేయ సంకల్పించిన ఆరోగ్య మహిళ కార్యక్రమం ఔనత్యాన్ని వివరిస్తూ దీనిని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ, ఇతర డయాగ్నోస్టిక్ పరీక్షలతో పాటు మహిళల అనారోగ్య సమస్యలకు సంబంధించిన కీలకమైన ఎనిమిది రకాల వైద్య సేవలను ఈ కార్యక్రమం ద్వారా అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. అవసరం అయిన వారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం సైతం అందించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి మంగళవారం నిర్ణీత కేంద్రాలలో ప్రత్యేకంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వారికి వైద్య సేవలు అందించేలా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఆకస్మిక గుండెపోటు మరణాలను నివారించాలన్న లక్ష్యంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చేపట్టిన సీ.పీ.ఆర్ శిక్షణలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రతి ఏటా సుమారు 24 వేల మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిన వారికి సీ.పీ.ఆర్ విధానాన్ని అమలు చేస్తే యాభై శాతం వరకు మరణాలను అరికట్టవచ్చన్నారు. వివిధ వర్గాల వారికి ప్రభుత్వం సీ.పీ.ఆర్ శిక్షణ అందించాలని నిర్ణయించిందన్నారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనీలకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ అందించి, ప్రతి జిల్లాకు ఐదుగురు చొప్పున పంపడం జరిగిందన్నారు. వారి ద్వారా అన్ని శాఖల ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులందరికి సీ.పీ.ఆర్ శిక్షణ అందేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఆకస్మిక గుండెపోటుకు గురైన వారికి స్వల్ప మోతాదులో ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే ఏ.ఈ.డీ పరికరాలను ప్రతి జిల్లాకు తక్షణం రెండు చొప్పున పంపిస్తున్నామని, త్వరలోనే అన్ని వైద్యారోగ్య కేంద్రాలకు సమకూరుస్తామని మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు 2018 -2019 , 2019 - 2020 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనుందని తెలిపారు.

సుమారు రూ. 650 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోందని, ఈ నిధులు నేరుగా సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయని వివరించారు. మిగతా రెండు సంవత్సరాలకు సంబంధించిన వడ్డీ లేని రుణాల నిధులను కూడా ప్రభుత్వం రెండుమూడు నెలల్లోనే జమచేయనుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డబుల్ బెడ్ రూమ్ పథకం, పోడు భూముల పట్టాల పంపిణీ, జీఓ నెంబర్లు 58 , 59 , 76 , 118 అమలు, తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మాట్లాడుతూ సి.పి.ఆర్. శిక్షణ, కంటి వెలుగు, ఆరోగ్య మహిళ, వడ్డి లేని రుణాలపై మంత్రి, సి.ఎస్. ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఆయా విషయాలపై అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయా కార్యక్రమాలను ప్రణాళికతో నిర్వహిస్తామని తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని , ఇప్పటివరకు 4,78,441 మందికి కంటి పరీక్షలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 45,700 మందికి రీడింగ్ గ్లాసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 3,95,823 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని కంటి పరీక్షల ద్వారా తేలిందని వివరించారు. ప్రిస్క్రిప్షన్ గ్లాసులను ఎప్పటికప్పుడు సంబంధిత లబ్ధిదారుకు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, అడిషనల్ ఎస్పీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి, జిల్లా అటవీ శాఖ అధికారి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, తదితర అధికారులు, పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed