అసెంబ్లీలో ప్రకటనలు సరే…వాస్తవ పరిస్థితిలో అమలు ఏది..?

by Kalyani |
అసెంబ్లీలో ప్రకటనలు సరే…వాస్తవ పరిస్థితిలో అమలు ఏది..?
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సంక్షేమ హాస్టల్స్ విషయంలో అసెంబ్లీలో ప్రకటనలు సరే.. వాస్తవ పరిస్థితిలో అమలు ఏది..? సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సూటిగా ప్రశ్నించారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి బీసీ హాస్టల్ లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే హరీష్ రావు న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ... గ్రీన్ ఛానల్ ద్వారా సంక్షేమ హాస్టల్స్ కు నెల నెలా నిధులు విడుదల చేస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో చేస్తున్న ప్రకటనలకు హాస్టల్స్ లో వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. ఆరు నెలలుగా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ లో ఉండటం దారుణమన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నెల నెల హాస్టల్ బిల్లులు చెల్లిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రగల్భాలు పలుకుతున్నాడని మండిపడ్డారు. కొత్త మెనూ సైతం అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఆగమాగం నిర్ణయాలు తీసుకొని పూర్తిగా విఫలమైందన్నారు.

హాస్టల్ విద్యార్థులకు 4 జతల బట్టలు ఇవ్వాల్సి ఉండగా రెండు జతల బట్టలు మాత్రమే ఇచ్చారని మరో రెండు జతల బట్టలు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది అన్నారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలు డిప్యూటీ సీఎం దుష్టికి తీసుకెళ్తానని హామీ నిచ్చారు. విద్యార్థులు డ్రగ్స్, అన్ లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. పేదరికం విద్యకు అడ్డు కాదు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లను ఆదర్శంగా తీసుకొని చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిర పడాలని సూచించారు. జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ లు ఆన్లైన్ గేమ్స్ కు బానిసలై అప్పుల పాలై ఆత్మ చేసుకున్న విషయం కలిచి వేసిందని హరీష్ రావు అన్నారు. అనంతరం హాస్టల్ విద్యార్థులకు టీ షర్ట్ లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed