చదువు విదేశాల్లో.. సీటు మాత్రం లోకల్.. ఎంబీబీఎస్‌లో విచిత్ర పరిస్థితి

by karthikeya |
చదువు విదేశాల్లో.. సీటు మాత్రం లోకల్.. ఎంబీబీఎస్‌లో విచిత్ర పరిస్థితి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలో చదివినా.. రెండేళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లిన విద్యార్థులు జీవో 33 ప్రకారం మెడికల్ అడ్మిషన్లలో నాన్ లోకల్ కింద పరిగణించబడుతున్నారు. అయితే ఓ విద్యార్థికి తెలంగాణతో సంబంధం లేకపోయినా. అసలు ఇండియాలోనే చదవకపోయినా.. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ కోసం అప్లయ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల హైకోర్టు ఆదేశాలతో 134 మంది కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశాన్ని పొందగా.. వారిలో ఈ విద్యార్థి కూడా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇలాంటి విద్యార్థులు మరి కొందరు ఉండొచ్చని వర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనిపై ఎంక్వయిరీ చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని ఓ అధికారి ఆఫ్ ది రికార్డులో చెప్పారు. అయితే కాళోజీ వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో తెలంగాణ విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మెరిట్ లిస్టుపై ఉత్కంఠ

ఎంబీబీఎస్ మెరిట్ లిస్టుపై ఉత్కంఠ నెలకొన్నది. ప్రభుత్వ, ప్రైవేట్‌, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లోని ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ మొదటి దశ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు ఆదివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. దీంతో ఏ క్షణమైనా మెరిట్ లిస్టు ప్రకటించే చాన్స్ ఉన్నది. ఈ నేపథ్యంలో స్థానికత కోల్పోయిన విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. మెరిట్ లిస్టు రిలీజ్ తర్వాత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీంతో తాము మంచి కాలేజీల్లో అవకాశాలు మిస్ అవుతామనే ఆందోళన ఆయా విద్యార్థుల్లో ఉన్నది. స్థానికతపై సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చే వరకు మెరిట్ లిస్టును హోల్డ్ లో పెడితే బాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు. ఈ ఒక్క ఏడాది తమ పిల్లలకు వెసులుబాటు కల్పించాలని పేరెంట్స్ సైతం రిక్వెస్ట్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహాలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

అక్కడా.. ఇక్కడా నాన్ లోకలే!

రాష్ట్రంలో ఈ దఫా నీట్ యూజీ పరీక్షను 77,848 మంది రాయగా, 47,356 మంది అర్హత సాధించారు. జీవో 33 ప్రకారం వరుసగా నాలుగేళ్లు 9, 10తోపాటు ఇంటర్మీడియట్ ఇక్కడే చదివి ఉంటే వారిని లోకల్ గా పరిగణిస్తారు. దీంతో టెన్త్ తర్వాత ఇంటర్, నీట్ కోచింగ్ కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన తెలంగాణ విద్యార్థులు నాన్ లోకల్ కోటా కిందకు వెళ్లిపోయారు. నాన్ లోకల్ అంటూ వర్సిటీ దాదాపు 924 మంది విద్యార్థుల అప్లికేషన్లను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. పైగా, పక్క రాష్ట్రాల్లో ఇంటర్ రెండు సంవత్సరాలు మాత్రమే చదవడం వలన, అక్కడ కూడా ఈ విద్యార్థులు నాన్ లోకల్ కింద పరిగణించబడుతున్నారు. మరోవైపు వీరిలో దాదాపు 50 శాతం మంది ఏపీలోనూ అప్లయ్ చేయగా, నాన్ లోకల్ కింద కన్సీడర్ చేశారు. దీంతో అక్కడా, ఇక్కడా ఆయా విద్యార్థులు నాన్ లోకల్ గా మారి ఆవేదన చెందుతున్నారు.

నేడు ‘సుప్రీం’ తీర్పు

నీట్ ఫలితాలు తర్వాత జీవో 33ని తీసుకువచ్చారు. దీంతో తాము నష్టపోతున్నామని 135 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. స్థానికతను నిర్ధారిస్తూ ఆయా విద్యార్థులను కౌన్సెలింగ్ కు అనుమతించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ తరహాలో మిగతా విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోమన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం 135 మందిని మాత్రమే అనుమతిస్తూ, మిగతా వాళ్లపై స్పందించకుండా జీవో 33ని అమలు చేస్తామని సుప్రీం కోర్టు కు వెళ్లింది. దీనిపై సోమవారం తీర్పు రానున్నది. మరోవైపు నాన్ లోకల్ గా గుర్తించిన దాదాపు 924 మందికి సర్టిఫికెట్ల అప్ లోడ్, వెరిఫికేషన్ కు సిద్ధంగా ఉండాలని వర్సిటీ మెస్సేజ్ లు కూడా పంపినట్లు సమాచారం.

మరో 18 మంది సుప్రీం కోర్టుకు...

135 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ కు అవకాశం ఇచ్చినట్లే.. తమకు కూడా ఇవ్వాలని నాన్ లోకల్ కోటాలోకి వెళ్లిన మరో 18 మంది విద్యార్థులు సుప్రీం కోర్టు కు వెళ్లినట్లు సమాచారం. వీళ్ల పిటిషన్లను కూ న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకొని తీర్పు ఇస్తారని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే చాలా మంది సరైన ఆర్థిక స్థోమత లేక కోర్టు మెట్లు ఎక్కని వాళ్లూ ఉన్నారు. దీంతో వాళ్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

ఆఫీసర్లు ఊహించలేదా?

నీట్ ఫలితాల తర్వాత జీవో 33 రిలీజ్ అయింది. దీంతో కొందరు విద్యార్ధులు నష్టపోతారని అధికారులకు స్పష్టంగా తెలుసు. కానీ ముందస్తుగా ఎలాంటి ప్లానింగ్ లేకుండా కాళోజీ వర్సిటీ విద్యార్థులను గందరగోళంలోకి నెట్టివేసింది. తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా, అధికారులు అందుకు తగిన విధంగా ప్రణాళిక, సలహాలు ఇవ్వకపోవడంతోనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొందరు డాక్టర్లు చెప్తున్నారు.

ఒక్క అవకాశమివ్వండి -గార్లపాటి వర్షిత, ఖమ్మం

నేను ఒకటి నుంచి 10 వ తరగతి వరకు హైదరాబాద్ మణికొండలో చదువుకున్నాను. కరోనా సమయంలో మా నాన్న చనిపోవడం వలన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఏపీలోని నూజివీడులో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. కానీ సడన్ గా జీవో 33 తో నాన్ లోకల్ కోటాలోకి వెళ్లిపోయాను. ఈ ఒక్క ఏడాది మా లాంటి విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలి.

Advertisement

Next Story

Most Viewed