- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు.. తెరవెనుక ఆ ఎమ్మెల్సీ
దిశ, తెలంగాణ బ్యూరో: మిషన్ భగీరథ నీళ్లు గ్రామాల్లో పారడం లేదు. ఇంట్రా విలేజ్ వర్క్స్ పెండింగ్ ఉండటంతోనీటి కష్టాలు తప్పడం లేదు. భగీరథ పథకంలో ఉన్నతస్థాయిలో కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రిడ్ పనులు, ఇంట్రా విలేజ్ వర్క్స్ ను వేర్వేరు చేయడంతోనే అసలు సమస్య ముందుకొచ్చింది. ఇక గ్రిడ్ పనుల్లో కీలకమైన పైపులు సరఫరా చేసే టెండర్లు అధికార పార్టీ కీలక నేతల చేతుల్లోకి వెళ్లాయి. బినామీ పేర్లతో సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా గ్రావిటీ ద్వారా వేసిన పైపులైన్లు పగిలిపోతున్నాయి. తక్కువ లోతుల్లో వేయడంతో.. చిన్న వాహనాలు వెళ్లినా పగులుతున్నాయి. అయితే, ఈ గ్రిడ్ పనులకు సంబంధించిన బిల్లుల్లో పైపులైన్లకు సంబంధించినవే వెనువెంటనే విడుదలవుతున్నాయి. ఓ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ఈ బిల్లులు సిద్ధమవుతున్నట్లు అధికారవర్గాల సమాచారం.
నీళ్లు వచ్చినా.. రాకున్నా!
మిషన్ భగీరథ పథకంలో పనులను రెండు భాగాలుగా విభజించారు. ఒకటి గ్రిడ్ పనులు కాగా, మరొకటి ఇంట్రా విలేజ్ వర్క్స్. ఈ గ్రిడ్ పనుల్లో భాగంగా నిర్ధేశించిన ప్రాంతం నుంచి గ్రామాల్లోని వాటర్ ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు పైపులైన్లు వేస్తున్నారు. ఈ పైపులైన్ల కాంట్రాక్ట్‌ను అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ బృందానికి అప్పగించారు. దీంతో పైపులైన్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే, వాటర్ ట్యాంకుల వరకు పైపులైన్ల కనెక్షన్లు ఇచ్చి, అక్కడి నుంచి నల్లాలకు నీరందించిన తర్వాతే గ్రిడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని నిబంధనలున్నాయి. కానీ.. వాటర్ ట్యాంకులకు పైపులైన్లు వేసిన తర్వాత ఒక్క రోజు కూడా ఆగకుండా బిల్లులు రెడీ చేస్తున్నారు. దీనికి ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులే చెప్పుతున్నారు.
అధ్వాన్నంగా ఇంట్రా విలేజ్ వర్క్స్
ఇక ఇంట్రా విలేజ్ వర్క్స్ చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తేటతెల్లమవుతోంది. గ్రిడ్ నుంచి వాటర్ ట్యాంకులకు వచ్చిన నీరు.. భగీరథ నల్లాలకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం ఇంట్రా విలేజ్ వర్క్స్ చేయకపోవడమే. గ్రిడ్ పనులపై పైపులు సరఫరా చేసే సంస్థలు.. ఇంట్రా విలేజ్ వర్క్స్‌ను మాత్రం చేయడం లేదు. దీంతో ఈ బాధ్యతలను అధికారులు.. సర్పంచ్‌లపై పెడుతున్నారు. ఇంట్రా వర్క్స్‌కు బిల్లులు ఇవ్వకపోవడం, ఏండ్లేకేండ్లుగా ఆలస్యం చేయడంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అధికారులు.. సర్పంచ్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. వాస్తవంగా వీటిని టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించినా.. వారు పనులు చేయకపోవడంతో సర్పంచ్‌లపై భారం పడుతోంది. అంతేకాకుండా గ్రామాల్లో ఇంట్రా విలేజ్ వర్క్స్‌కు వేసే పైపులైన్లు కనీసం మీటరు లోతుల్లో కూడా వేయడం లేదు. ఫలితంగా చిన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఈ పైపులైన్ల పైనుంచి వెళ్లినా వెంటనే పగిలిపోతున్నాయి. పైపులు పగిలి, వాటిలో మట్టి చేరి, లింకుల దగ్గర నీరంతా ఆగిపోతోంది. దీంతో లీకేజీలు ఎక్కువవుతున్నాయి. దీంతో భగీరథ నల్లాల నుంచి నీరు రావడం లేదు.
బిల్లులు రాక.. పనులకే బ్రేక్
ఎంతో కొంత పనులు జరిగిన ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంటే.. మరికొన్ని ప్రాంతాల్లో అసలు పనులే సాగడం లేదు. చాలా గ్రామాల్లో సగం పనులు కూడా జరుగలేదు. కానీ, పాత పైపులైన్ల నుంచి వచ్చే నీటినే మిషన్ భగీరథ నీళ్లుగా చెప్పుకుంటున్నారు. ఇంట్రా విలేజ్ వర్క్స్ జరుగకపోవడానికి మరో కారణం బిల్లులు రాకపోవడమే. సర్పంచ్‌లపై ఒత్తిడి తెచ్చి, హడావుడిగా పనులు చేపించిన అధికారులు.. బిల్లులు ఇవ్వడంలో మాత్రం మొండికేస్తున్నారు. అటు గ్రిడ్ పనుల్లో భాగంగా పైపులైన్లు వేసిన వారికి ఆగమేఘాల మీద చెక్కులు ఇస్తున్నారు.
గ్రిడ్ వర్సెస్ ఇంట్రా
మిషన్ భగీరథ పథకంలో ఇప్పుడు కొత్త కథ తెరపైకి వస్తోంది. ఇంట్రా విలేజ్ వర్క్స్ చేయక చాలా మంది కాంట్రాక్టర్లు మధ్యలోనే చేతులెత్తేశారు. ఒక్కో గ్రామంలో 40 నుంచి 70 శాతం పనులు చేసి, మళ్లీ అటువైపు వెళ్లడం లేదు. దీంతో భగీరథ పనులు మూలకు పడ్డాయి. అయితే కొన్ని సందర్భాల్లో రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై గ్రామస్థాయిల్లో ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు. సర్పంచ్‌లు మొండికేస్తే.. ఒక దశలో బెదిరింపులకు కూడా దిగుతున్నారు. అయితే, ఇంట్రా విలేజ్ వర్క్స్ మధ్యలోనే ఉండటంతో వాటిని పూర్తి చేసేందుకు ఇంట్రా వర్క్స్ నుంచి కాకుండా గ్రిడ్ నుంచి బిల్లులిచ్చేందుకు హామీ ఇచ్చి సర్పంచ్‌లతో పనులు చేపించారు. గ్రిడ్ పనుల పేరుతో అగ్రిమెంట్ చేసుకుని, ఇంట్రా విలేజ్ వర్క్స్ చేపిస్తున్నారు. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఇంట్రా వింగ్‌లో నిధులు లేవని దాటవేస్తున్నారు. అటు గ్రిడ్ నుంచి ఇచ్చేందుకు బిల్లులు చేసినా.. ఇంట్రా వర్క్స్ కావడంతో సాధ్యం కావడం లేదు. ఇలా ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే ఇంట్రా విలేజ్ వర్క్స్ పనులకు సంబంధించిన రూ. 25 నుంచి రూ. 50 కోట్ల వరకు బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్ పెట్టారు. దీంతో కొన్నిచోట్ల సర్పంచ్‌లు పని చేసి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో వందల గ్రామాల్లో పనులు చేసేందుకు సాహసించడం లేదు.