మహిళలకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపు..!

by Satheesh |
మహిళలకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపు..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కులను కాలరాస్తూ మహిళలను అణిచివేస్తున్నాయని మావోయిస్ట్ పార్టీ ఆరోపించింది. ఎంతో అభివృద్ధి చెందుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న దోపిడీ పాలక వర్గాలు బ్రాహ్మణీయ, హిందుత్వ, భూస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తూ మహిళల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తింది. మార్చి 8న జరగబోయే 113వ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవాన్ని స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల దాడులకు వ్యతిరేకంగా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ చర్ల-శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ లేఖను విడుదల చేశారు.

శ్రామిక మహిళల పోరాట స్పూర్తిని చాటిచెప్పే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దోపీడీ పాలక వర్గాలు తప్పుదోవ పట్టిస్తూ ముగ్గుల పోటీలు, అందాల పోటీలు నిర్వహిస్తూ స్త్రీని పురుషుడి బానిసగా మర్చే సిద్ధాంతాలను మహిళలపై రుద్దుతున్నారని మండిపడ్డారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక హత్యలు, వరకట్న హత్యలకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న చట్టాలను ఈ పాలక వర్గాలు నీరుగార్చి దోషులను స్వేచ్ఛగా తిరిగేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మావోయిస్టుల పేరుతో అమాయక ఆదివాసీ, మహిళలపై దాడులు చేస్తున్నారని, అయితే తమ అస్తిత్వం కోసం మహిళలు ముందువరుసలో ఉండి వీరోచితంగా పోరాడుతున్నారని అన్నారు.

ప్రజల కోసం విప్లవోద్యమంలో పని చేస్తున్న కామ్రేడ్ అనిత(లింగవ్వ)ను ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సీ-60 కమాండోస్ కలిసి బూటకపు ఎన్ కౌంటర్‌లో చంపేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీడిత విధానాల నుంచి ప్రజలను విముక్తి కల్పించడం కోసం పోరాటం చేస్తున్న మావోయిస్ట్ పార్టీ నాయకులు కామ్రేడ్లు సుజాత, రజిత, దౌవే, ధన్నీలను అక్రమంగా అరెస్ట్ చేసి విడుదల కాకుండా కుట్ర చేస్తున్నారని అన్నారు. మానవ హక్కుల చట్టాల అమలు కోసం పోరాడుతున్న మహిళా సంఘాలు, ఉద్యమకారులు, మేధావులపై కేసులు పెట్టి నిర్భంధిస్తున్నారని, ఈ దోపిడీ పాలన విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed