ఇప్పటికే చిక్కుల్లో చాలా మంది నేతలు.. పార్టీల్లో అఫిడవిట్ టెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-08-23 09:16:59.0  )
ఇప్పటికే చిక్కుల్లో చాలా మంది నేతలు.. పార్టీల్లో అఫిడవిట్ టెన్షన్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించింది. మిగతా పార్టీలు సైతం క్యాండిడేట్లను అనౌన్స్ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని పార్టీల నేతలను అఫిడవిట్ అంశం టెన్షన్ పెట్టిస్తోంది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేస్తుండటం.. ఇప్పటికే చాలా మంది నేతలపై కేసులు కొనసాగుతుండటంతో ఇప్పుడు అందరిలోనూ హాట్‌టాపిక్ అయింది. అఫిడవిట్‌లో క్యాస్ట్, క్వాలిఫికేషన్, ఆస్తులు, నేరచరిత్ర వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. దీంతో వీటిలో ఏ చిన్న తప్పుడు సమాచారం ఇచ్చినా ప్రత్యర్థులు కోర్టులకు ఎక్కుతుండటం నేతలను ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే 25 మంది ఎమ్మెల్యేలపై కేసులు

ప్రస్తుతం తెలంగాణలో చాలా మంది ప్రజాప్రతినిధులపై అఫిడవిట్ల వివాదాలు నడుస్తున్నాయి. వీటిలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిపైనే అధికంగా ఆరోపణలు ఉన్నాయి. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌ ఎన్నికపై వివాదం నడుస్తుండగా.. ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, మర్రి జనార్దన్, ముత్తిరెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరిపై హైకోర్టులో పిటిషన్లు కొనసాగుతున్నాయి. ఇలా దాదాపు 25 మంది ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విద్యార్హతపై ఆరోపణలు ఉన్నాయి. మరికొంత మంది ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన వాళ్లేననే విమర్శలు వస్తున్నాయి.

తెరపైకి క్యాస్ట్ వివాదం!

ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అభ్యర్థులు, ఆశావహుల క్యాస్ట్ వివాదం తెరమీదకు వచ్చింది. తాజాగా ప్రకటించిన ఖానాపూర్ క్యాండిడేట్ జాన్సన్ నాయక్‌పై సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన అసలు ఎస్టీనే కాదని ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కాంగ్రెస్ నాయకుడు, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ ఎస్సీ సర్టిఫికెట్‌ను కలెక్టర్ రద్దు చేయడం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయింది. గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని అన్ని పార్టీలు భావిస్తున్న వేళ అభ్యర్థిని ప్రకటించాక ఈ తరహా ఆరోపణలు వస్తే విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే వణుకు అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.

Advertisement

Next Story