తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన మహేశ్వర్ రెడ్డి.. ఏమన్నారంటే..?

by Satheesh |
తెలంగాణ బడ్జెట్‌పై స్పందించిన మహేశ్వర్ రెడ్డి.. ఏమన్నారంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడాయి, అప్పులు, అబద్ధాల, ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. శాసనసభ సమావేశాల సందర్భంగా గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. పలు పథకాల కోసం రూ.62వేల కోట్ల అప్పు ఎలా తెస్తారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రూ.50 వేల కోట్ల అదనపు రెవెన్యూ ఎలా వస్తుందో చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో గమనిస్తున్నారని, రాష్ట్రాన్ని దివాలా తీసే దిశగా తీసుకెళ్తున్నారని ఫైరయ్యారు. ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ధ్వజమెత్తారు.

35 లక్షల నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎలా చెల్లిస్తారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు బడ్జెట్ కేటాయించలేదని, మహిళలను మోసం చేసేలా బడ్జెట్ ప్రవేశపెట్టారని మహేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. గృహలక్ష్మికి రూ.17500 కోట్లు కూడా కేటాయించలేదన్నారు. అరకొర నిధులతో ప్రాజెక్టులు ఎలా ముందుకు తీసుకువెళ్తారో సమాధానం చెప్పాలని ఏలేటి ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి ఎలా అప్పు తెస్తారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం కొడంగల్ కోసమే ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎద్దేవాచేశారు.

Advertisement

Next Story