తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్‌లోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు?

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-25 02:12:31.0  )
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. కాంగ్రెస్‌లోకి మరో ముగ్గురు బీఆర్ఎస్ కీలక నేతలు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితంగా ఉండే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్‌లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుంది’ అంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. గులాబీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా..? లేక కావాలని కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ.. ఎవరూ చేరలేదు. తాజాగా.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది.

ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్‌కు దూరం

ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చేరువయ్యారు. వారిలో గ్రేటర్ హైదరాబాద్‌కు దానం నాగేందర్(ఖైరతాబాద్), ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్), అరికెపూడిగాంధీ(శేరిలింగంపల్లి), గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్ చెరువు) ఉన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ రాబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా చేరికలు స్పీడ్ పెంచాలని భావిస్తున్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నది. తాజాగా మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు చేరబోతున్నారని కాంగ్రెస్ లీకులు ఇచ్చింది. గ్రేటర్‌కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతోనూ ఇప్పటికే సంప్రదింపులు చేసినట్లు సమాచారం. అవసరమైతే ఒకరిద్దరికి కేబినెట్‌లో చోటు ఇవ్వాలని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లుగానూ ప్రచారం ఉంది. అయితే.. వారి చేరికపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇద్దరు మాజీ మంత్రుల ఆసక్తి

గత ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన ఇద్దరు మాజీ మంత్రులు సైతం కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. వారిలో ఒకరికి విద్యాసంస్థలు ఉండగా.. వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నేందుకు సిద్ధం అయ్యారన్న టాక్ నడుస్తున్నది. అంతేకాకుండా ఆయనపై పేట్‌బషీర్‌బాద్‌లో భూ కబ్జా చేశారన్న కేసు సైతం ఉంది. ఇక గొర్రెల స్కీమ్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో మాజీ మంత్రి సైతం ‘హస్తం’ గూటికి చేరాలనే ఉత్సాహంతో ఉన్నారని తెలుస్తున్నది. వీరితోపాటే మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ వ్యాపారాలను చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. వీరిలో గ్రేటర్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు టాక్. అధికార పక్షాన్ని అడ్డుపెట్టుకొని వారి బిజినెస్‌ను కాపాడుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అధికార పార్టీలో ఉంటే ఎలాంటి ఢోకా ఉండబోదని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు నేతల ఆలోచనగా సమాచారం. మరోవైపు.. గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టులేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని నేతలను చేర్చకొని పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. వస్తామన్న నేతలను చేర్చుకొని గ్రేటర్ ఎన్నికల నాటికి జీహెచ్ఎంసీపై పట్టు సాధించాలని భావిస్తున్నట్లు సమాచారం.

కలిసొచ్చిన హైకోర్టు తీర్పు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపుల విషయంలో స్పీకర్‌దే తుది నిర్ణయం అని న్యాయస్థానం తేల్చిచెప్పడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఉత్సాహం కనిపించింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం ఉండదని, అక్కడ కూడా ఇదే తీర్పు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చినట్టు సమాచారం. హైకోర్టు తీర్పును అనుసరించి బీఆర్ఎస్ నుంచి మరికొంత మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతున్నది.

గులాబీ బాస్ ఆరా

ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారబోరని, ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిన వారే ప్రాధాన్యత లేక ఇబ్బందులు పడుతున్నారని, తిరిగి గులాబీకి వస్తామంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పీసీసీ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో.. పార్టీ మారేందుకు ఎవరెవరు సిద్ధమవుతున్నారని గులాబీ బాస్ ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story
null