పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

by Sridhar Babu |   ( Updated:2024-09-25 10:03:55.0  )

దిశ, జడ్చర్ల : పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని ఉదండాపూర్ రిజర్వాయర్ పరిస్థితిని రాష్ట్ర మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఆ శాఖల అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా సాగునీటిని అందించలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , రాష్ట్ర మంత్రివర్గం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించినట్టు తెలిపారు.

మరోసారి ఉమ్మడి పాలమూరు జిల్లా అధికారులతోనూ సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ శాసనసభ కాలంలోనే పాలమూరు- సంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ఉత్తమ్​కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మిగిలిన నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమ తదితర ఎత్తిపోతలు, ప్రాజెక్టుల పనులను పూర్తి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఉదండాపూర్ ముంపు గ్రామాల రైతులకు 45 కోట్ల రూపాయలను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పట్టుబట్టి ఉదండాపూర్ రిజర్వాయర్​ను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

నిర్వాసితులకు న్యాయం జరగాలి : నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి నిర్వాసితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర మంత్రులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి విజ్ఞప్తి చేశారు. నాలుగు తండాలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద 45 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై మల్లు రవి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. భూ సేకరణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న మరో రూ.మూడు కోట్ల 74 లక్షలు, ఆర్అండ్ఆర్​కు సంబంధించి రూ.రెండు కోట్ల 60 లక్షలు, గండాపూర్ నిర్వాసితులకు 13 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

9 లక్షల ఎకరాలకు సాగునీరు : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ పూర్తయితే 9 లక్షల ఎకరాలకు, కరివేన రిజర్వాయర్ ద్వారా 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది అని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును ఆగం పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పూర్తి చేసి సాగునీటిని అందిస్తుందని తెలిపారు. ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి సహకరిస్తున్న మంత్రికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

అంతకుముందు కోటి 29 లక్షల రూపాయలతో నిర్మించనున్న వల్లూరు- కిష్టారం డైవర్షన్ బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేద్ ఉల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు ఏన్నం శ్రీనివాస్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, ఈర్లపల్లి శంకర్, రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశాంతి జీవన్ పాటిల్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకి, ఎస్ఈ చక్రధరం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed