దేశంలో 400 సీట్లు గెలుస్తున్నాం...! : గుజరాత్ ముఖ్యమంత్రి

by Disha Web Desk 11 |
దేశంలో 400 సీట్లు గెలుస్తున్నాం...! : గుజరాత్ ముఖ్యమంత్రి
X

దిశ, నాగర్ కర్నూల్:- దేశంలో మోడీ గాలి వీస్తుందని, ఈసారి 400 సీట్లు సాధించి మోడీ మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నల్లవెల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ.. దేశంలో అవినీతి అక్రమాలను అరికట్టడం, ధరల నియంత్రణ, దేశ అభివృద్ధి లో మోడీ ప్రధాన భూమిక పోషించి, దేశాన్ని అగ్రగామిగా నిలిపారని అన్నారు.

ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకువచ్చి.. ప్రపంచ దృష్టిని భారతదేశం వైపుకు మలిపిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ అని అభివర్ణించారు. దేశానికి నేడు మోడీ అవసరం ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఎన్నికల్లో మోడీ కంటే మించిన బలమైన నాయకుడు లేడన్నారు. దేశ వికాసానికి బీజేపీ ఒక్కటే ప్రామాణికమని దానికి ప్రధానిగా మోడీ మాత్రమే అర్హుడని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో మోడీ పాత్ర కీలకమన్నారు. కోట్లాదిమందికి ఉచిత రేషన్ తోపాటు భరోసా కల్పించిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుంది అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ...

నాగర్ కర్నూల్ బీజేపీ అభ్యర్థిగా ఆయన తనయుడు పోతుగంటి భరత్ ప్రసాద్ ను బీజేపీ నాగర్ కర్నూల్ స్థానాన్ని కేటాయించిందని ఆయనను ఎంపీగా గెలిపించి నరేంద్ర మోడీకి బహుమతిగా ఇద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ పై కేవలం వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవి అమలు కాకపోవడం వల్లే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు.

జూన్ రెండో వారంలో మూడోసారి మోడీని ప్రధానిని చూడాలంటే నాగర్ కర్నూల్ పార్లమెంట్ నుంచి భరత్ ప్రసాద్ ను ఎంపీగా గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ సారథ్యంలో అవినీతి నిర్మూలన, కుటుంబ పాలన నిర్మూలన, నూతన విద్యా విధానం అమలు చేయడం జరిగిందన్నారు. 500 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రామ మందిరాన్ని నిర్మించిన ఘనత బీజేపీ సర్కార్ కే దక్కిందన్నారు. 370 ఆర్టికల్ ను రద్దు చేయడం జరిగిందని అన్నారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాల గుర్తింపు పొందిందన్నారు. ప్రజలకు హామీలు ఇచ్చి విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు.

బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ...

భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం కీలకమని అన్నారు. దేశం సమాంతర అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీజేపీతోనే సాధ్యమన్నారు. యువతకు, మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వం తోనే సాధ్యం పడుతుందన్నారు. ప్రజల కోసం కష్టపడుతున్న బీజేపీపార్టీని ఆదరించాలని కోరారు. సర్వేలన్నీ నరేంద్ర మోడీ వైపే ఉన్నాయన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ బీజేపీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సూచించారు. బీజేపీశ్రేణులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు బీజేపీ గెలుపు కోసం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, నియోజకవర్గ ఇన్చార్జ్ దిలీపాచారి, డిసిసిబి డైరెక్టర్, ఏపీ రాష్ట్ర నాయకులు జక్కా రఘునందన్ రెడ్డి లతోపాటు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed